ప్రజాశక్తి-హుకుంపేట:ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం లో గిరిజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మండలంలోని సూకూరు గ్రామ పంచాయతీ సచివాలయం వద్దకు ఫ్యామిలీ పిజిషియన్ విధానాన్ని అరకు శాసనసభ్యులు శెట్టి పాల్గుణతో కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉన్నారని, ఒక వైద్యుడు సచివాలయం పరిధిలోని వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. వారానికీ రెండు సార్లు వైద్య శిబిరాలు నిర్వహిస్తారని, బీపీ, షుగర్‌తో బాధ పడుతున్న రోగులకు రెగ్యులర్‌గా పరీక్షలు చేస్తారని తెలిపారు. గర్భిణులకు, బాలింతలకు వైద్య పరీక్షలు సచివాలయంలో నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాకు 34 అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయని, చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నాటు వైద్యులను ఆశ్రయిస్తే ప్రాణాపాయం ఉంటుందన్నారు. పీహెచ్‌లోనే 90 శాతం ఖాళీలను భర్తీ చేశామన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదు నుండి 10 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, గర్భిణీలు ప్రసవ సమయానికి రెండు వారాలు ముందుగానే ఆసుపత్రిలో చేరాలని ఆయన సూచించారు. ఆశాలు, ఏఎన్‌ఎంలు ఫ్యామిలీ డాక్టర్ విధానంపై ప్రజలకు చైతన్యవంతం చేయాలని అయన సూచించారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, వైద్య నిపుణులు అందుబాటు లోకి వస్తారన్నారు. అనంతరం మెడికల్ రికార్డులను పరిశీలించారు.
అరకు శాసనసభ్యులు పాల్గుణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. వైద్య సేవలకు అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రూ.500 కోట్ల వ్యయంతో పాడేరులో మెడికల్ కళాశాల నిర్మిస్తున్నామన్నారు. మంచానికి పరిమితమైన వృద్ధులు, వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి ఇంటికి వెళ్లి వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిటిసిఓ విశ్వేశ్వర్ నాయుడు, ఎంపీపీ కూడా రాజబాబు, జెడ్పిటిసి రేగం మత్య్సలింగం, సూకూరు సర్పంచ్ దనసాని సత్యవతి, హుకుంపేట సర్పంచ్ వెంకట పూర్ణిమ, జిల్లా మేనేజర్ ఎస్.మురళి, వైద్యాధికారి మోహన్ సాయి రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి:
మండలంలోని తంటికొండ సచివాలయం ఒట్టిగడ్డ గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ ఆగూరి సుబ్బలక్ష్మి, రాజవొమ్మంగి పిహెచ్‌సి వైద్యాధికారి లిఖిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని జెడ్పిటిసి ఒడుగుల జ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి దేశచరిత్రలోనే వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చూట్టారని తెలిపారు. ఆధునిక వైద్యాన్ని ఉచితంగా ప్రతి గడప వద్దకు తీసుకొచ్చే విధానమే ఫ్యామిలీ డాక్టర్ అని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ప్రతి పేదవాడి ఇంటి ముందుకు డాక్టరు, మందులు వస్తాయని, పింఛన్లు ఇంటికి నడిచి వచ్చినట్లుగా వైద్యం కూడా మీ ముంగిట్లోకి వస్తుందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌లు ఉంటాయని, ఇందులో 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ విలేజ్ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానిస్తారని తెలిపారు. ఈ ఫ్యామిలీ డాక్టర్ పరిధిలో నయం కాని రోగాలను వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్ ద్వారా ఆరోగ్యశ్రీకి రిఫర్ చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.










