ప్రజాశక్తి-పాడేరు టౌన్: ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. సోమవారం ఐటిడిఎ కార్యాలయం ఆవరణలో జిల్లాకు కొత్తగా మంజూరైన 104 అంబులెన్సులను పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ పిహెచ్‌సిలో ఇద్దరు వైద్యులున్నారని, ఒకరు సచివాలయం పరిధిలో వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. బిపి, షుగర్ ఇతర కమ్యూనికబుల్ డిసీజెస్‌తో బాధపడుతున్న రోగులకు రెగ్యులర్ చెకప్ చేస్తారన్నారు. గర్భిణీలు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. నవజాత శిశు సంరక్షణ సేవలు అందిస్తారన్నారు. అంగన్వాడీ సెంటర్లు సందర్శించి రక్తహీనతతో బాధ పడుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వైద్యం అందిస్తారన్నారు. పిహెచ్ సిలలో 90 శాతం ఖాళీలను భర్తీ చేసామని తెలిపారు. అరకు, చింతపల్లి ఏరియా ఆసుపత్రులలో శస్త్ర చికిత్సలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడే వారు జిల్లా ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించు కోవాలని సూచించారు. 15 మందికి సికిల్ సెల్ ఎనిమియాను గుర్తించామని మెరుగైన వైద్యంతో పాటు పింఛనులు అందించడానికి చర్యలు చేపట్టామని చెప్పారు. వచ్చే మూడు నెలలో రెండు వేల మందికి సికిల్ సెల్ ఎనిమియా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ,
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. వైద్య ఆరోగ్య సేవలకు అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ప్రతీ ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పాడేరు ఐటిడిఎ పరిధిలోని ప్రతీ మండలానికి రెండు 104 అంబులెన్సులు ఉన్నాయన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం ద్వారా ఇంటింటికి వైద్య సేవలు అందుతున్నాయన్నారు. జికె వీధి (ధారకొండ)కు అరకువ్యాలీ, ముంచింగిపుట్టు, పాడేరు మండలాలకు కొత్త అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. పాడేరులో మరొక అంబులెన్సు రిజర్వులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డా.జమాల్ బాషా, డిటిసిఒ టి.విశ్వేశ్వరనాయుడు, ఎంపిపి ఎస్.రత్నకుమారి, 104 జిల్లా మేనేజర్ ఎన్.మురళి తదితరులు పాల్గొన్నారు.










