Jan 30,2023 21:57

సాగు భూములపై యాజమాన్య హక్కుల కోసం కదంతొక్కిన గిరిజనం
ఏజెన్సీ గిరిజన సంఘం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆందోళన
గిరిజనుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి; మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

పోలవరం మండలంలో గిరిజనుల సాగులో ఉన్న భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఏజెన్సీ గిరిజన సంఘం, రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది గిరిజనులు ఏలూరు జిల్లా కలెక్టరేట్‌ వద్ద సోమవరం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. పోలవరం మండలంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి తరలొచ్చిన వేలాది మంది గిరిజనులు ముందుగా ఏలూరు జ్యూట్‌ మిల్లు నుంచి ప్రదర్శనగా బయలుదేరి 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములకు హక్కులు కల్పించాలంటూ నినదిస్తూ ప్రదర్శన కొనసాగించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, రైతుసంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్‌ వడ్డే శోభనాదీశ్వరరావు మాట్లాడారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో నిర్ధారించి పట్టాలు ఇవ్వడంతోపాటు, రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి గ్రామాలను ఖాళీ చేయించాలని తెలిపారు. కాపర్‌ డ్యాం కట్టడంతో గత్యంతరం లేక గిరిజనులు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లారన్నారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే న్యాయ స్థానాలను ఆశ్రయించి న్యాయం పొందేందుకు సైతం గిరిజనులు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ పోలవరం మండలంలో గిరిజనులు 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మాజీ జమీందారుకు ఉన్న భూములపై 2002లో జరిగిన చర్చల్లో ఆ భూములు వివాదాస్పద భూములని పిఒ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ధ్రువీకరించిందన్నారు. నాటి నుండి నేటి వరకు గిరిజనుల సాగు నమోదు చేయడం లేదని, హక్కులు కల్పించడం లేదని విమర్శించారు. ఈ ధర్నాకు రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్‌ భాషా అధ్యక్షత వహించారు. సంఘీభావంగా అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షులు జై వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డి వర్మ, గుంటూరు జిల్లా కార్యదర్శి ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు వేట్ల విజయబీ, గిరిజన సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కుంజం రామారావు, జిల్లా నాయకులు సవలం రాంబాబు మాట్లాడారు. అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన ఐటిడిఎ పిఒచే విచారణ చేయిస్తామన్నారు. ధర్నా అనంతరం డప్పు నత్యాలతో కలెక్టరేట్‌ నుండి జ్యూట్‌మిల్లు వరకు మరోసారి ప్రదర్శన నిర్వహించారు. ప్రజాకళాకారులు పాడిన పాటలు ఉత్తేజాన్ని కల్గించాయి.