Oct 26,2023 20:55

మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-సాలూరు : మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో అనేక మంది గిరిజన రైతులను కొంతమంది వ్యక్తులు బురిడీ కొట్టించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ట్రాక్టర్‌, ఇతర వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తామని చెప్పి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారయ్యారు. గంజాయిభద్ర పంచాయతీ పరిధిలో ఉన్న ఎగువశెంబి, దిగువశెంబి, దూళిభద్రతోపాటు ఇతర గిరిశిఖర గ్రామాల్లో రైతులకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు గుంజుకున్నట్లు గిరిజనులు వాపోతున్నారు. దిగువశెంబి గ్రామానికి చెందిన కూనేటి రాజేష్‌, కూనేటి నర్సు, కూనేటి ఉత్తర, కూనేటి డోంబురు, ఎగువ శెంబికి చెందిన తాడంగి చిరంజీవి నుంచి డబ్బులు వసూలు చేశారు. వీరిలో దిగువ శెంబి గ్రామానికి చెందిన కూనేటి రాజేష్‌ రూ.58 వేలు ఇచ్చి మోసపోయాడు. పేదల గృహ నిర్మాణంలో భాగంగా తన ఇంటికి మంజూరైన రూ.58 వేల బిల్లు మొత్తాన్ని ట్రాక్టర్‌ ఇస్తారని భావించి చెల్లించానని కూనేటి రాజేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. మిగిలిన రైతుల నుంచి 12,500 రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. దూళిభద్ర గ్రామానికి చెందిన రైతుల నుంచి కూడా 73 వేల రూపాయలు వసూలు చేశారని చెపుతున్నారు. మండలంలోని గంజాయిభద్ర గ్రామాల నుంచి కూడా వసూలు చేశారని చెప్పారు. ట్రాక్టర్‌, పవర్‌ టిల్లర్‌ వంటి వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తామని నమ్మబలికి వసూలు చేశారని గిరిజన రైతులు రాజేష్‌, నర్సు వాపోయారు.
నెల్లూరు జిల్లాకి చెందిన వాసు నాయుడు, కిసాన్‌ క్రాఫ్ట్‌ సూపర్‌ వైజర్‌నని చెప్పుకున్న ఎన్‌.శ్రీనివాస్‌ అనే ఇద్దరు వ్యక్తులు తమ గ్రామానికి మోటార్‌ సైకిల్‌పై వచ్చి డబ్బులు వసూలు చేశారని తెలిపారు. మూడు నెలల క్రితం డబ్బులు వసూలు చేసి పరారయ్యారని, ఫోన్‌ చేస్తే ఎత్తడం లేదని వాపోయారు. ఈ విషయంపై మూడు నెలల క్రితం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మూడు సార్లు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళినా స్పందించలేదని చెప్పారు. తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు.