ప్రజాశక్తి-రంపచోడవరం
గిరిజనులంటే ఈ ప్రభుత్వానికి ఎంతటి చిన్నచూపో రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని చూస్తే తెలుస్తుంది. దెబ్బ తగిలితే కట్టు కట్టడానికి క్లాత్ బ్యాండేజ్ కూడా లేదంటే ఈ ఆసుపత్రిలో వైద్యంపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గిరిజనులకు వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. రంపచోడవరం ఏజెన్సీలోని 7 మండలాల గిరిజనులకు ఈ ఏరియా ఆసుపత్రే పెద్ద దిక్కు. వెయ్యి పడకల గల ఈ ఆసుపత్రికి రోజూ వందలాది మంది వైద్యం నిమిత్తం వస్తున్నారు. కాని ఈ ఆసుపత్రిలో కనీసం ఉండాల్సిన పరికారాలు, మందులు లేకపోవడంతో గిరిజనులకు వైద్యం అందడం లేదు. ప్రమాదాల్లో గాయపడిన వారికి ఎముకుల సంబంధిత వైద్యం అందక ఇబ్బంది పడాల్సి వస్తోంది. శనివారం ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం.
రోడ్డు ప్రమాదంలో చెయ్యి విరిగిన గిరిజనుడు శనివారం ఏరియా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చాడు. ఆయనకు సిమెంట్ కట్టు వేయడానికి కనీసం ఉండాల్సిన మెటీరియల్ కూడా ఆసుపత్రిలో లేదు. మందుల్లేవు. చివరికి కట్టుకట్టడానికి కావాల్సిన క్లాత్ బ్యాండేజ్ కూడా లేదు. మెటీరియల్ బయట నుండి తెచ్చుకుంటే కట్టుకడతామని వైద్యుడు చెప్పడంతో చేసేది లేక ప్రైవేటు మందుల దుకాణంలో బాధితుని బంధువులు కొనుగోలు చేసి తెచ్చారు. విరిగిన చెయ్యికి ఆపరేషన్ కోసం అవసరమైన ప్లేట్‌ను రాజమండ్రి వెళ్లి కొనుగోలు చేసి తెచ్చుకోవాలని వైద్యులు సూచించారు. దానికి మరో రూ.2,200 ఖర్చు చేయాల్సి వస్తుంది.
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గిరిజనులకు పూర్తి స్థాయిలో వైద్యం ఉచితంగా అందించాల్సి ఉందికదా అని బాధితుని బంధువులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ను కల్పనను అడగ్గా తమ ఆసుపత్రిలో పరికరాలు లేవని, అందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం నుంచి రావడం లేదని బదులిచ్చారు. ఒక్క ఎముకుల వైద్యమే కాదు, ఏ రకమైన వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినా అన్నీ ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుంటే ఆ సొమ్ము కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఏరియా ఆసుపత్రిలో వైద్యానికి కావాల్సిన పరికరాలు, మందులు, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
ప్రభుత్వం అన్ని సౌకర్యాలు
ఏర్పాటు చేయాలి
ఈ ఆసుపత్రి మా కోసం ఉందని అనుకుంటున్నాం. కాని ఇక్కడ ఎముకలకు సంబంధించిన పరికరాలు ఏమీ లేవు. దీని వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అని సౌకర్యాలు కల్పించాలి.
- బాపిరాజు, గిరిజనుడు
పరికరాలు ఉంటే మెరుగైన వైద్యం
ఆసుపత్రిలో వైద్యం చేయడానికి కావాల్సిన పరికరాలు ఏర్పాటు చేస్తే మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. నేను ఈ ఆసుపత్రికి వచ్చి తొమ్మిది నెలలు అయింది. అప్పటి నుండి ఎముకలకు సంబంధించిన వైద్యం కోసం కావాల్సినవి బాధితులు బయట కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. నాకు మూడు నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాను.
- డాక్టర్ సుధాకర్, ఎముకల వైద్య నిపుణులు.
ప్రభుత్వం నుంచి
నిధులు రావడం లేదు
ఆసుపత్రిలో మందులు, ఆపరేషన్ చేయడానికి ఎటువంటి పరికరాలు లేవు. ఇందుకు అవసరమైన నిధులు ప్రభుత్వ నుండి రావడం లేదు. దీని వల్ల తాము సరైన వైద్యం అందించలేకపోతున్నాం. ఎముకుల వైద్యానికి కావాల్సిన పరికరాలు లేకపోవడం వల్లే బయట నుండి కొనుగోలు చేసి తేవాలని గిరిజనులకు చెప్పాం.
- డాక్టర్ కల్పన, ఆసుపత్రి సూపరింటెండెంట్










