ప్రజాశక్తి-పాడేరు:జి.మాడుగుల మండలం గడుతూరు, సొలభం పంచాయతీ పరిధిలో వున్న బొడ్డుమామిడి గిరిజనులకు ఆధార్, ఓటు హక్కు కల్పించాలని, అంజలి శనివారం నుండి బొడ్డు మామిడి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస, మండల నాయకులు పాలికి లక్కు, బొజ్జన్న తదితరులు బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. డిశంబర్ 1న సిపిఎం బృందం ఈ పంచాయతీలో పర్యటించిందని, బొడ్డుమామిడి గ్రామంలో సుమారు 175 మంది కొండదొర గిరిజన తెగ ప్రజలు నివసిస్తున్నారని అప్పలర్స తెలిపారు. ఆజాదికా అమృతా మహౌత్సావాలు నిర్వహిస్తున్న ఈ కాలంలో బొడ్డుమామిడి గిరిజన ప్రజలకు 76వ స్వాతంత్య్ర దినోత్సవ ఫలాలు నేటికి అందటం లేదన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు గ్రామ సందర్శనకు కూడా వెళ్ల లేదని, గ్రామంలో సుమారు 60 మంది గిరిజన చిన్నారులు వుంటే గ్రామ పెద్ద ఇంటి వద్ద నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 7 మంది చిన్నారులకు మాత్రమే ప్రవేశాలు కల్పించారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మిగిలిన 53 మంది చిన్నారులకు ఆధార్ కార్డు లేకపోవడంతో బడికి దూరంగా ఉన్నారని, బడి ఈడు పిల్లలు గ్రామంలో ఆటపాటలకే పరిమితమయ్యారని వివరించారు. చిన్నారులతో పాటు పెద్ద వారికి కూడా ఆధార్ కార్డులు లేనివారు ఎక్కువమంది ఉన్నారని తెలిపారు. బొడ్డుమామిడి గ్రామంలో ఆధార్ సెంటర్ నిర్వహించి నమోదు చేయాలన్నారు.175 మంది గిరిజన ప్రజలు వుంటే కేవలం 43 మందికి మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నా రన్నారు. అంజలి శనివారం నుండి బొడ్డుమామిడి వరకు సుమారు 20 కిలోమీటర్లు పరిధిల్లో రహదారి లేక సుమారు 13గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ స్పందన..
బొడ్డుమామిడి గ్రామంలో ఆధార్, ఓటర్ నమోదు కోసం కనీసం 5 రోజులకు తగ్గకుండా ప్రత్యేకంగా నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, వచ్చే 15 రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని అప్పలనర్స తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు జారీ చేసిన వెంటనే రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.










