ప్రజాశక్తి-పాడేరు:ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ ముందిరంలో జాయింట్ కలెక్టర్ జె.శివశ్రీనివాసు, అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవలతో కలిసి స్పందనలో భాగంగా 65 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించలేదని అర్జీదారులు రెండ సారి స్పందనకు రాకుండా అధికారులు వారి ఇళ్లకు వెళ్లి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ పి.అంబేద్కర్, గిరిజన సంక్షేమ శాఖ డిడి ఐ.కొండలరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్ భాషా, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ డి.వి.ఆర్.ఎం. రాజు, రహదారులు భవనాల శాఖ ఇఇ బాల సుందర బాబు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నంద్, జిల్లా ఉద్యానవన అధికారి రమేష్ కుమార్‌రావు, పి.హెచ్.ఓ. ఎన్.అశోక్, ఐటిడి ఏ పరిపాలనాధికారి హేమలత, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇఇ లీలాకృష్ణ, డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్. కుమార్, పాడేరు తహశీల్దార్ వి.వి. త్రినాధరావునాయుడు, హుకుంపేట తహశీల్దార్ రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
స్పందనలో వచ్చిన కొన్ని వినతులు....
పాడేరు మండల కేంద్రం తలారిసింగి హెలిప్యాడ్ వద్ద ఉన్న మినీ స్టేడియంను అభివృద్ధి చేయాలని ఫిజికల్ డైరెక్టర్లు టీ.సద్దు, పి.సూరిబాబు, జి.మన్మధరావు తదితరులు వినతి పత్రం సమర్పించారు. ముంచింగుట్టు మండలం కించాయిపుట్టు, గుమ్మసిరసాపుట్టు గ్రామాలకు తాగునీటి సదుపాయాలు కల్పించాలని, ముంచంగి పుట్టు మండల కేంద్రం ఆర్‌ఎస్ కార్యాలయం ముందున్న ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని, అక్రమణలకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలని గిరిజన సంఘం ఉపాధ్యాక్షులు ఎం.ఎం. శ్రీసు వినతిపత్రంలో కోరారు.










