Nov 19,2023 20:58

మాట్లాడుతున్న ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకర్‌ రావు

గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కృషి
- రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకర్‌ రావు
- జిల్లాలో విస్తృత పర్యటన
- సిరివెళ్లలో ఎస్‌టిలతో సమావేశం
- పలు సమస్యలు విన్నవించిన గిరిజనలు
ప్రజాశక్తి - రుద్రవరం

    గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకర్‌ రావు తెలిపారు. ఆదివారం నంద్యాల జిల్లాలో రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ విస్తృతంగా పర్యటించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల మండలం మహదేవపురం గ్రామంలోని ఎస్‌టి కాలనీని ఆయన సందర్శించారు. కాలనీలో వెదురు బుట్టల అల్లకందారులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ముడి సరుకైన వెదురు లభ్యతలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు పిల్లల విద్య విషయమై ప్రశ్నించి విద్య వలన కలిగే ఉపయోగాలు తెలిపి పాఠశాలలకు తప్పనిసరిగా పంపాలని ఆయన సూచించారు. అనంతరం స్థానిక పురపాలక సంఘ పాఠశాలలో రాష్ట్ర ఎరుకల సంఘం నాయకులు, బంజారా నాయకులు, ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్‌ డివిజి శంకర్రావు పాల్గొన్నారు. స్థానిక సమస్యలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, అటవీ భూమి మంజూరు వంటి పలు సమస్యలను నాయకులు చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరుతూ వినతులు అందజేశారు. అనంతరం కమిషన్‌ సభ్యులు వడిత్య శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ గిరిజనులు విద్య వలనే ఉన్నత స్థాయికి చేరగలన్నారు. అనంతరం చైర్మన్‌ డివిజి శంకర్‌ రావును స్థానికులు, వివిధ సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం డివిజి శంకర్‌ రావు మాట్లాడుతూ ఉదయం నుంచి వచ్చిన వినతులను పరిశీలించామని చెప్పారు. ముఖ్యంగా వెదురు బుట్టల అల్లకం దారుల సమస్యపై సత్వర చర్యలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఈ వృత్తి లాభదాయకరమైనదిగా లేకపోవడం వలన ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుండి భూములు ఇప్పించడం లేదా ముడి సరుకు సబ్సిడీపై ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. గిరిజనులు పేరుకు భూమిపుత్రులు అయినా భూమి లేని వారిగా ఉండటం కమిషన్‌ గమనించిందని, అందుకే గిరిజనుల హక్కులు, సంక్షేమం, సాధికారిత కోసం సంఘాలకు అతీతంగా ఏకీకృతంగా కషి చేయాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బలవంతులు బలహీనులను అణచివేసే చర్యలను అన్ని సంఘాలు ఖండించాలన్నారు. కమిషన్‌కు ఏ విధంగా అయినా సమస్యలు తెలుపుకోవచ్చని సంఘ సభ్యులకు, గిరిజనులకు సూచించారు. కోర్‌ కమిటీ ఏపి వైఎస్‌ఎస్‌ మెంబర్‌ కె.సుబ్బరాయుడు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎపి వైఎస్‌ఎస్‌ సంఘం నాయకులు పాలకుర్తి శ్రీనివాసరావు, కుమార్‌, జైలీలా శంకర్‌, బంజారా హక్కుల సంఘ నాయకుల శ్రీనివాస నాయక్‌, బి.శంకర్‌ నాయక్‌, వివిధ జిల్లాల గిరిజన సంఘ నాయకులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.