Aug 23,2023 22:00

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
           గిరిజనులు సాగుచేసుకుంటున్న ఎల్‌టిఆర్‌, 1/70, పోడుభూములకు పట్టాలివ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఐటిడిఎ ఎదుట ధర్నా నిర్వహించారు. గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ తరతరాలుగా గిరిజనులు సాగుచేస్తున్న ఎల్‌టిఆర్‌, 1/70, పోడు భూములకు పట్టాలివ్వాలని అనేక ఆందోళనలు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. ఏజెన్సీలోని వేలాది ఎకరాల్లో గిరిజనులు తరతరాలుగా వ్యవసాయం చేస్తున్నప్పటికీ వారి పేర్లను అడంగళ్‌లో నమోదు చేయడం లేదన్నారు. కౌలుకు చేస్తున్న గిరిజనేతరుల పేర్లను మాత్రం నమోదు చేయడం దుర్మార్గమన్నారు. గిరిజనేతరులకు ప్రొటెక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చే అధికారం ఆర్‌డిఒకు లేదని చెప్పిన వారే అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. మర్లగూడెంలో గిరిజనులు సాగుచేస్తున్న భూములకు గిరిజనేతరులకు అనుకూలంగా ఆర్‌డిఒ ప్రొటెక్షన్‌ ఇవ్వడం వాటి ఆధారంగా గిరిజనేతరులు రౌడీలను వెంటపెట్టుకుని పోలీసుల సమక్షంలో గిరిజనులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. జీలుగుమిల్లి తహశీల్దార్‌ గిరిజనేతరులకు తప్పుడు ప్రొటెక్షన్‌ ఇస్తున్నారన్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ, గిరిజన చట్టాలకు లోబడి గిరిజనేతరుల కౌలు వ్యవసాయం ఉందని, పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్‌ భూములను కొందరు వందలాది ఎకరాలకు తక్కువ కౌలుకు తీసుకుని ఆదివాసీలను మోసం చేస్తున్నారన్నారు. దొరమామిడి, కోటనాగవరం, నిమ్మలగూడెం ప్రాంతంలో ఆర్‌అండ్‌ఆర్‌ భూములు తక్కువ కౌలుతో గిరిజనేతరులు వ్యవసాయం చేస్తున్నారన్నారు. వందల ఎకరాల్లో ఒక్కరే వ్యవసాయం చేస్తున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో భూ వివాదాలను అరికట్టేందుకు ఇరుపక్షాలతో రికార్డ్‌ పరిశీలన చేయాలన్నారు. తక్షణం గ్రామసభలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. గ్రామసభలు నిర్వహించి హక్కు పట్టాలు కోసం రోడ్‌ మ్యాప్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజకు వినతపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో పర్యటించి గిరిజనులకు న్యాయం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తెల్లం దుర్గారావు, బొరగం భూ చంద్రం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.నాగమణి, గుడెల్లి వెంకట్రావు, చుండ్రు బుల్లెమ్మ, కోర్స జలపాలు, వెట్టి వీరయ్య పాల్గొన్నారు.