ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
ల్యాండ్ సీలింగ్, గిరిజనుల సాగులో ఉన్న ఎల్‌టిఆర్ భూములకు పట్టాలివ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆద్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు భూ పంపిణీ చేయాలని పంగిడిగూడెం, నాగులగూడెం, పట్టెన్నపాలెం, కేతవరం గురవాయిగూడెం గ్రామాల దళితులు, గిరిజనులు, పేద ప్రజలు స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం నుంచి మసీదు సెంటర్ మీదగా తహశీల్దార్ కార్యాలయం వరకూ గురువారం 200 మందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంఘం మండల కార్యదర్శి ఎ.ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎం.జీవరత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మండలంలో ఉన్న మూడు వేల ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూములు గిరిజనులు సాగు చేస్తున్న ఎల్‌టిఆర్ భూములకు పట్టాలు మంజూరు చేయకుండా భూస్వాములకు తొత్తుగా వ్యవహరిస్తుందన్నారు. 20 ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న నాగులగూడెం గ్రామ పేదలకు పట్టాలివ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. పోరాటాల ద్వారా సాధించుకున్న ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. చట్టం వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ భూములు భూస్వాములు, అధికార పార్టీ నాయకుల ఆధీనంలో ఉన్నాయన్నారు. సిఎం జగన్ ఎన్నికల ముందు దళితులకు, గిరిజనులకు, పేద ప్రజలకు నవరత్నాలు అందిస్తానని హామీ ఇచ్చారు కానీ పేద ప్రజలకు ఈ పథకాలు అందించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. వ్యవసాయ కార్మికులంతా పనుల్లేక అవస్థలు పడుతున్నారని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి పనులు చూపాలని డిమాండ్ చేశారు. అనేక మంది పనుల్లేక ఉపాధి కోసం వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భూ పంపిణీ కూడా చేర్చి దశరత్నాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మండలంలోని పంగిడిగూడెం, కేతవరం, గురవాయిగూడెం, నాగుల గూడెం పట్టెన్నపాలెం గ్రామాల్లో 20 ఏళ్లుగా భూపారాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేదలు భూములు పంచమని అడుగుతుంటే భూస్వాములు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై పేదలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వై.సీత, జోడి సూర్యచంద్రరావు, మాదాసు ఆనందరావు, కె.సుబ్బారావు, పూసం దర్గ, నాగరాజు, కె.లక్ష్మి, జి.రాంబాబు, జి.సూర్య కిరణ్, ఎ.కాంతమ్మ, బి.సువార్త, జి.నాగమణి, గొల్ల పేరంటాలు పాల్గొన్నారు.










