ప్రజాశక్తి-పాడేరు టౌన్: అనంతగిరి మండలంలో ఏళ్ల తరబడి, పూర్వీకుల నుంచి గిరిజనుల సాగులో ఉన్న భూములను లాక్కునేందుకు విజయనగరం పివిజి మహరాజులు ప్రయత్నిస్తున్నారని, అదికారులు స్పందించి వాటిని కాపాడాలని అనంతగిరి జెడ్‌పిటిసి, సిపిఎం నేత దీసరి గంగరాజు డిమాండ్ చేశారు. గిరిజనుల పక్షాన జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఒ, సబ్ కలెక్టర్ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోకపోతే భూ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయం నుంచి ఐటిడిఎ వరకు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు శుక్రవారం నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టారు. ఐటిడిఎ కార్యాలయం లోపలకు వెళ్ళేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. నాయకులు, రైతులు కింద కూర్చొని ధర్నా చేశారు. గిరిజనుల హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని నినాదాలు చేశారు. లోపల వెళ్లి సమస్యను అధికారులకు తెలియజేస్తామని నాయకులు విన్నవించారు. ఎస్‌ఐ రంజిత్ నిరాకరించి ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల అనుమతితో నాయకులను, కొద్దిమంది రైతులను లోపలికి అనుమతించారు. స్పందన కార్యక్రమంలో ఉన్న ఐటిడిఎ పిఒ వి అభిషేక్‌ను కలిసి వినతి పత్రాన్ని అందించి సమస్యను వివరించారు. అనంతగిరి మండల పరిధిలో అనంతగిరి, ఎగువశోభ, టోకూరు, కొండిబ పంచాయితీల పరిధిలో అరకు రోడ్డును ఆనుకుని ఏళ్ల తరబడి గిరిజనులు భూములను సాగు చేస్తున్నారన్నారు. 4 పంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాల పరిధిలో గిరిజనులు సాగు చేస్తున్న సుమారు 300 ఎకరాల భూమిని విజయనగరం మహారాజుకు చెందిన కొంతమంది వ్యక్తులు వచ్చి వారి భూములు అంటున్నారని తెలిపారు. 1/70 చట్టాన్ని అతిక్రమిస్తూ 5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనుల సాగులో ఉన్న భూములను లాక్కునేందుకు ప్రయత్ని స్తున్నారన్నారు. భూములకు సంబంధించి తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చిందని, ఖాళీ చేయాలని, కోర్టు ఉత్తర్వులు ప్రకారం జిల్లా కలెక్టర్ భూములను అప్పగిస్తారని గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. గిరిజనుల తరఫున కోర్టుకు అప్పీల్ చేయాలని, గిరిజనుల భూములకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మండలానికి చెందిన ఎంపిటిసి, సిపిఎం నాయకుడు కొండలరావు, గిరిజన సంఘం నాయకులు పాలికి లక్కు, ఆర్.సుందరరావు, టోకూరు, ఎగువశోభ సర్పంచులు కిల్లో మొస్య, సింహాద్రి, భూ సాధన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.సుబ్బారావు, జి.రమేష్, లక్ష్మణ్, భీమరాజు, నాగరాజు, సురేష్, రైతులు పాల్గొన్నారు.










