Nov 07,2023 20:56

పాఠశాల ముందు నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

ప్రజాశక్తి - సాలూరు : మండల విద్యాశాఖాధికారి రాజ్‌కుమార్‌కు సమస్యలు చెప్పడానికి వెళ్లిన గిరిజనుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరుపై గంగన్నదొరవలస గ్రామస్తులు భగ్గుమంటున్నారు. తమ పాఠశాలలో ఉన్న ముగ్గురు ఉపాధ్యాయుల్లో ఒకర్ని మరో పాఠశాలకు డెప్యుటేషన్‌ వేయడంతో పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని చెప్పేందుకు ఆ గ్రామానికి చెందిన మహిళలు, పిల్లల తల్లిదండ్రులు రెండు రోజుల ఎంఇఒ కార్యాలయానికి క్రితం వెళ్లారు. వీరిపై ఎంఇఒ రాజ్‌ కుమార్‌ విరుచుకుపడ్డారు. మీ దిక్కున్న చోట చెప్పుకోండని గర్జించారని, ఎక్కువ మాట్లాడితే కేసు పెట్టిస్తానని బెదిరించినట్లు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. 42మంది విద్యార్ధులున్న పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడ్ని మరో పాఠశాలకు డెప్యుటేషన్‌ వేయడం సరికాదన్నారు. దీని వల్ల తమ పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎంఇఒ అనుచితంగా మాట్లాడారని పరసన్న దొర, జ్యోతి, అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఇఒ వైఖరికి నిరసనగా బుధవారం నుంచి తమ పిల్లలను పాఠశాలకు పంపకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గిరిజనులమైన తాము సమస్యలు చెప్పడానికి వెళ్తే తమ పైనే కేసులు పెట్టిస్తానని ఎంఇఒ రాజ్‌ కుమార్‌ బెదిరించడంపై వారు ఆగ్రహం తో రగిలిపోతున్నారు.
అసలు విషయం ఏమిటంటే
మండలంలోని గంగన్నదొర వలస ఎంపి ప్రాథమిక పాఠశాలలో కొద్ది నెలల క్రితం వరకు ముగ్గురు ఉపాధ్యాయులు పని చేసేవారు. అయితే అధికారపార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గిన ఎంఇఒ రాజ్‌ కుమార్‌ ఇక్కడి నుండి ఒక ఉపాధ్యాయుడ్ని దండిగాం పాఠశాలకు డెప్యుటేషన్‌ వేశారు. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుడ్ని బాగువలస హైస్కూల్‌కు డెప్యుటేషన్‌ వేశారు. ఇదంతా ఓ అధికార పార్టీ నాయకుడి ఒత్తిడి మేరకు ఎంఇఒ చేశారు. అయితే ఇటీవల దండిగాం పాఠశాలలో మరో ఉపాధ్యాయుడు చేరారు. దీంతో తమ పాఠశాల ఉపాధ్యాయుడ్ని రప్పించాలని కోరడానికి గంగన్నదొరవలస గ్రామస్తులు ఎంఇఒ వద్దకు వెళ్లారు. అలా వెళ్లి అడగడమే నేరమన్నట్లు ఎంఇఒ వ్యవహార శైలి చూసి వారు విస్తుపోయారు. ఇటీవల కాలంలో మండలంలో ఉపాధ్యాయులను ఇష్టారాజ్యంగా డెప్యుటేషన్ల పేరుతో బదిలీలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆమ్యామ్యాలు దండిగా అందాయనే ప్రచారం జరుగుతోంది.