ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
తరతరాలుగా పోడుభూములు సాగుచేస్తున్న గిరిజనులకు హక్కు పట్టాలివ్వాలని ఎపి వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎ.రవి, ఎపి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏజెన్సీలో గిరిజనుల సాగులో ఉన్న పోడుభూములపై తక్షణం ఆర్‌ఒఎఫ్‌ఆర్ గ్రామసభలు నిర్వహించాలని ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పట్టాలివ్వాలని, అటవీ హక్కు చట్ట సవరణ వద్దంటూ, డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు గిరిజన సంఘం బుట్టాయగూడెం మండల అధ్యక్షులు కారం భాస్కర్ అధ్యక్షత వహించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎ.రవి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం తరతరాలుగా పోడు భూములు సాగుచేస్తున్న గిరిజనులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడవులను కొద్దిమంది వ్యక్తులకు వేల ఎకరాలు కేటాయించేందుకు అటవీ హక్కుల చట్టాన్ని సవరిస్తోందన్నారు. అడవులను వ్యక్తులకు కేటాయించేందుకు కలెక్టర్ ఆమోదిస్తే సరిపోతుందని సవరణలు తీసుకురావడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ చర్యలకు లక్షలాది గిరిజనులు అడవుల నుండి దూరమవుతారని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యక్తులకు అడవులను కేటాయించేందుకు గ్రామసభల అవసరం లేదని మార్పు చేయడం బాధాకరమన్నారు. ఆదివాసులకు వజ్రాయుధంగా ఉన్న ఆర్‌ఒఎఫ్‌ఆర్ గ్రామ సభలు నిర్వీర్యమైతే ఆదివాసీలు పోడు భూములకు దూరమవుతారన్నారు. గ్రామసభలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చట్టాన్ని నీరుగారుస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ వ్యక్తులకు అడవులను కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం సవరణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా సహకరించేలా చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాల అమలుకు బటన్ నొక్కె కార్యక్రమం తీసుకుందని లక్షలాది మంది ఆదివాసీలకు ఉపయోగపడే పోడు భూముల బటన్ ఎప్పుడు నొక్కుతారో స్పష్టం చేయాలన్నారు. అటవీ హక్కుల చట్టం వచ్చి 13 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో గిరిజనులకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా లేవని విమర్శించారు. గత డిసెంబర్‌లో ఐటిడిఎ వద్ద పోడు సాగుదారులు వ్యక్తిగత దరఖాస్తు చేసుకున్నప్పటికీ నేటి వరకూ గ్రామ సభలు ఎందుకు నిర్వహించలేదో అధికారులు స్పష్టం చేయాలన్నారు. అధికారులు స్పందించి గ్రామ సభలు నిర్వహించాలని, లేనిపక్షంలో డివిజన్ కార్యాలయం ఎదుట నిరంతర ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో వినతిపత్రాన్ని ఆర్‌డిఒ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పోలోజు నాగేశ్వరరావు, చుండ్రు బుల్లెమ్మ, ఎం.పోచమ్మ, చోడెం దుర్గారావు, వెట్టి వీరయ్య, తెల్లం వెంకటలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తామ ముత్యాలమ్మ, మండల కార్యదర్శి ఉడత వెంకటేష్, గిరిజనులు పాల్గొన్నారు.










