
ప్రజాశక్తి-రోలుగుంట:రోలుగుంట మండలం నీలిబంద గ్రామంలో సమస్యలు పరిష్కరించి, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు ఇవ్వాలని శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు మాట్లాడుతూ, రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పిత్రిగడ్డ శివారు గ్రామమైన నీలిబంద గ్రామంలో ఆరు కుటుంబాలు 25 మంది జనాభా కొందుతెగ చెందినటువంటి గిరిజనులు జీవనం సాగిస్తున్నారన్నారు. శరభవరం సచివాలయం పరిధిలో శివార గ్రామమైన 15కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండల మధ్య జీవనం సాగిస్తున్నారన్నారు. దట్టమైన అడవి మధ్యలో చీకట్లో బతుకు తున్నారన్నారు. వీరు ప్రధానంగా జీడిమామిడి తోటల పై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. గ్రామంలో కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయాలని, మంచినీరు కోసం రెండు కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండల మధ్య కర్ర ఒక సాయంతో నీరు తెచ్చుకొని బతుకుతున్నారన్నారు. రేషన్ బియ్యంకు 15 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గ్రామంలో ఇద్దరికి వృద్దాప్య పెన్షన్లు ఇస్తున్నారని, నగదు తీసుకునేందుకు డోలు కట్టుకొని లోసింగి గ్రామానికి వెళ్లాలన్నారు. పనులు లేక పోవడంతో ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి వీరికి ఉపాధి పథకం పనులు కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాన్ షెడ్యూల్ ప్రాంతం కావడంతో గిరిజనులంటే అధికారులు పట్టించు కోలేదన్నారు. ఇప్పటికైనా కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొర్ర కొండబాబు, కొర్ర కృష్ణ, గంబిల అప్పారావు పాల్గొన్నారు.