ప్రజాశక్తి - ఎటపాక
గిరిజనుల హక్కులు, చట్టాల రక్షణకు ఆదివాసీలంతా ఐక్యమై పోరాటం చేయాలని మాజీ ఎంపీ, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్ డాక్టర్ మిడియం బాబూరావు పిలుపునిచ్చారు. బుధవారం విస్సాపురంలో సోందే రామారావు అధ్యక్షతన ఏపీ గిరిజన సంఘం ఎటపాక మండలం మూడో మహాసభ జరిగింది. ముందుగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోత రామారావు జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో మిడియం బాబూరావు మాట్లాడుతూ అటవీ ఉత్పత్తుల సేకరణ, పోడు వ్యవసాయంపై ఆధారపడి గిరిజనుల జీవనం సాగుతుందన్నారు. అడవుల్లో 39 రకాల ఉత్పత్తులను గిరిజనులు సేకరించి ప్రభుత్వాలకు అమ్ముతున్నా వారికి అంతంత మాత్రమే ఆదాయం వస్తుందని, ఈ ఉత్పత్తులను కార్పొరేట్ కంపెనీలు రసాయన పరిశ్రమల్లో ఉపయోగించి వేలకోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు అటవీ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు అనుభవం లేదంటూ వారిపై నియంత్రణకు పాల్పడుతూ, సేకరణను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. పోడు వ్యవసాయం చేయకుండా, చట్టాల్లో సవరణ చేస్తూ ఆదివాసీలను అడవుల నుండి తరిమి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. అడవిలో జంతువులకు ఉండే ప్రాధాన్యత గిరిజనులకు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. పోలవరం నిర్మాణంలో అధిక శాతం గిరిజనులే నిర్వాసితులయ్యారని, వారికి పునరావసం కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు.
నూతన కమిటీ ఎన్నిక
అనంతరం గిరిజన సంఘం మండల నూతన కమిటీ 17 మందితో ఎన్నికైంది. గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులుగా కాకా అర్జున్ దొర, ఇరపా అజరు కుమార్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎటపాక వైస్ ఎంపీపీ పెనుబల్లి కుమారి, గిరిజన సంఘం నాయకులు బొప్పెన కిరణ్, పులి సంతోష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు, పిఎన్‌ఎం నాయకులు ఐవి, ఐద్వా నాయకులు పొడియం రత్తమ్మ, సీఐటీయూ నాయకులు గంపల హారనాధ్ తదితరులు పాల్గొన్నారు.










