Oct 11,2023 22:16

మహాసభలో మాట్లాడుతున్న ఎపి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అవినాష్‌

ప్రజాశక్తి - కురుపాం : ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం నిరంతరం అలుపెరగని పోరాటాలు చేయడానికి గిరిజనులంతా సిద్ధంగా ఉండాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌ అన్నారు. మండలంలోని నీలకంఠాపురంలో గిరిజన సంఘం నాయకులు బి.వెంకట్రావు ఆధ్వర్యంలో గిరిజన సంఘం ఏడో మండల మహాసభలు బుధవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల హక్కులను కాలరాస్తున్నాయని, కావున గిరిజనులంతా ఏకతాటిపైకి వచ్చి నిరంతరంగా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని అప్పుడే హక్కులు సాధించగలమని అన్నారు. అనంతరం గిరిజన సంఘం మండల నూతన కమిటీని 15 మంది సభ్యులతో మండల అధ్యక్షులుగా వి.వాసు, కార్యదర్శిగా బి.అనిల్‌, సహాయ కార్యదర్శి వెంకట్రావు, కోశాధికారి భాస్కరావు, ఉపాధ్యక్షలు వెంకట్రావు, సహాయ కార్యదర్శి కె.సుజాత ఎన్నుకున్నారు. కొండపోడు పట్టాలు సాధన, మినీగెడ్డలపై చెక్కుడాముల నిర్మాణం, జీడీకి మద్దతు ధర ప్రభుత్వం కల్పించాలని, బోయ వాల్మీకులను ఎస్‌టిలో చేర్చొద్దని, జీవో 3కు చట్టబద్ధత కల్పించాలని కమిటీ ఇవి సాధించేందుకు కృషి చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.రమణ, జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, మండలంలో గల గిరిజన సంఘం నాయకులు గిరిజనులు పాల్గొన్నారు.