* ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోహనరావు
ప్రజాశక్తి- మందస: గిరిజనుల భూములకు, వారి తోటలకు రక్షణ కల్పించాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహన్‌రావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సవర ధర్మారావు, సవర ఫల్గుణరావు డిమాండ్ చేశారు. ఆదివారం మందస మండలంలోని చాపరాయకాలనీకి చెందిన గిరిజనుల భూములను ఆక్రమించి తొలగించిన టేకు చెట్లను వారు పరిశీలించారు. తరతరాలుగా గిరిజనుల సాగులో ఉన్న జిరాయతీ భూములను, వారు వేసుకున్న తోటలను, టేకు చెట్లను గిరిజనేతరులు కరగాన సుధా యాదవ్ తన అనుచరులు కలిసి తొలగించి, గిరిజనంపై దాడి చేయడం అన్యాయమన్నారు. గిరిజనులకు అన్ని రకాల హక్కు పత్రాలు ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల అండతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. గిరిజన మహిళలపై చేయి చేసుకోవడం దుర్మార్గమైన చర్యని వారన్నారు. ఈ విషయాన్ని అధికారులకు, పోలీసులకు తెలియజేసినా స్పందన లేకపోవడం దారుణమన్నారు. మందస ప్రాంతంలో కొంతకాలంగా గిరిజనులపై దాడులు చేసి, భూములను ఆక్రమించుకోవడం, తప్పుడు పత్రాలు సృష్టించి కొనుగోలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. కొంతమంది నాయకుల అండతో జరుగుతున్న ఈ అరాచకంపై ఉన్నతాధికారులు స్పందించి, గిరిజనుల భూములకు, పంటలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల కోసం గిరిజనులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో సవర జయరాజ్, సవర బాలకృష్ణ, సవర జగ్గారావు, తిరుపతి, రామారావు, జ్వరాడు, తదితరులు పాల్గొన్నారు.










