ప్రజాశక్తి -అనంతగిరి:తాతల కాలం నుండి సాగు చేస్తున్న భూములను మైదాన ప్రాంతాలకు చెందిన భూస్వాములు దౌర్జన్యంగా లాక్కొంటే చూస్తూ ఊరుకునేది లేదని, గిరిజన సాంప్రదాయ ఆయుధాలు లతో తరిమి కొడతామని సిపిఎం జెడ్పిటిసి దీసరి .గంగరాజు హెచ్చరించారు. నాన్ షెడ్యూల్ కొంపల్లి పంచాయతీ బూరిగ, చిన్నకోనెల గ్రామాలలో శనివారం జెడ్పిటిసితో పాటు రెవిన్యూ బృందం సందర్శించింది. అనంతరం భూ సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, మైదాన ప్రాంతాలకు చెందిన భూస్వాములు తమ భూములను లాక్కున్నారని, వాటిని తమకే తిరిగి అప్పజెప్పాలని వేడుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, సుమారు 72 మంది రైతులు 120 ఎకరాల పైగా భూమిలో తాత ముత్తాతల కాలం నుండి వ్యవసాయ పంటలు పండించుకుంటూ జీవనాధారం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ భూములపై కన్ను వేసిన విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల మైదాన ప్రాంతాలకు చెందిన భూ స్వాములు భూదందాకు పాల్పడుతున్నారని, దీనిపై పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. 10 నెల 6న రెవిన్యూ బృందంతో సందర్శించి రైతుల సమక్షంలో సర్వే చేపట్టగా బూరిగ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 1 నుండి 2 వరకు బూరిగ గ్రామంలో ఉన్న 93 ఎకరాల 67 సెంట్ల భూమిలో 30 ఎకరాల 19 సెంట్ల భూమి ప్రభుత్వ భూమిగా రుజువైందని తెలిపారు. 63 ఎకరాల 48 సెంట్ల భూమిని భూ స్వాములైన మళ్లీ రెడ్డి .దొరబాబు, కందుల జగదీష్ పేర్లతో నమోదుపై రైతులు కోరగా రెవిన్యూ అధికారులు తిరిగి రైతులకు నోటీసులు జారీ చేశారన్నారు. రైతులు ఇదేమిటని మనో శోభకు గురై చింత చెట్టు వద్ద మెడకు ఉరితాడు వేసుకొని తమ భూములు తమకే కల్పించాలని వినూత్న రీతిలో నిరసన చేపట్టారని తెలపారు. భూ స్వాములకు కొమ్ము కాస్తున్న రెవిన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని, రైతుల భూమి వారికి దక్కే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఈ భూములపై అనేక ఫిర్యాదులు వెళ్లడంతో సబ్ కలెక్టర్ కోర్టులో వివాదం నడుస్తుందని, అయినా భూ స్వాములకు కొమ్ముకాస్తూ కాసులకు కక్కుర్తి పడి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోటపార్తి. చిరంజీవి, ఉప సర్పంచ్ సింహాద్రి, సిపిఎం మండల నాయకులు జె. సుబ్బారావు, ఎం.కృష్ణ, వార్డు మెంబర్లు సింహాచలం, .అప్పలరాజు, పెంటయ్య పాల్గొన్నారు










