ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : గిరిజనులే కదా? అని చిన్నచూపు చూసినా, వారికి ద్రోహం చేయాలని చూసినా సహించేది లేదని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ హెచ్చరించారు. గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పిస్తామని ఒకవైపు ప్రభుత్వం ప్రచారం చేస్తూనే మరోవైపు అదే భూముల్లో అక్రమ తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. నకరికల్లు మండలం చేజర్లకు చెందిన గిరిజన రైతులతో కలిసి 'జగనన్నకు చెబుదాం'లో పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విజరుకుమార్ మాట్లాడుతూ చేజర్లలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని 20 కుటుంబాలకు చెందిన వారు తరరాలుగా చేసుకుంటున్నారని, వీరికి నోటీసులేమీ ఇవ్వకుండానే రెవెన్యూ అధికారుల మైనింగ్ అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు? ప్రభుత్వ భూమి అయినా సరే సాగుదారుల వద్ద నుంచి తీసుకోవాలంటే ముందు సర్వే చేసి, గ్రామసభలు జరిపి, పరిశీలన చేసి, అభ్యంతరాలేమీ లేకపోతేనే మైనింగ్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అక్రమ తవ్వకాల కోసం రైతులపై రౌడీషీటర్‌లు దౌర్జన్యం చేస్తున్నారని, ఇది దుర్మార్గపు చర్యని అన్నారు. నాడు అడవుల్లో ప్రస్తుతం మైనింగ్ అనుమతులిచ్చిన ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులను అప్పటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నాడు సర్పంచ్‌గా వ్యవహరించిన అంజిరెడ్డి సేకరించి గిరిజన కాలనీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం అదే భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వారికి మరే ఆధారము లేదని వివరించారు. మంత్రి అంబటి రాంబాబు అండ చూసుకుని వైసిపి నాయకులు ఆ భూములను ఖాళీ చేయాలని రైతులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూములలో మైనింగ్ జరగకుండా నిలిపేసి గిరిజన రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. దీనికోసం సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.బాబు, వినుకొండ నియోజకవర్గం కార్యదర్శి పి.విజరు, ఎంఆర్‌పిఎస్ నాయకులు ఆర్.ప్రసన్నకుమార్, పిడిఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్‌వలి, పిడిఎఫ్ సభ్యులు ఎన్.రామారావు, నంగార భేరి సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు కృష్ణనాయక్, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కోటానాయక్, ఎరుకుల కుల వృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.అంజి, బాధిత గిరిజన రైతులు పాల్గొన్నారు.










