Feb 13,2023 23:04

ప్రజాశక్తి-విజయవాడ: ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా గిరిజనులు అభివృద్ది చెందాలని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జి.కొండూరు మండలం కవులూరు గ్రామనికి చెందిన 18 మంది యానాది గిరిజన లబ్దిదారులకు,జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు జాjయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజరు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు కృష్ణానదిలో చేపల వేటకు అనుమతి పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా యానాది గిరిజన లబ్దిదారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ చెడు వ్యసనాలకు దూరంగా వుండాలని, పిల్లలను బాగా చదివించుకుని వృద్దిలోకి రావాలన్నారు. చేపల వేట ద్వారా మత్స్య సంపదను విక్రయించుకుని ఆర్థికంగా వృద్దిలోకి రావాలన్నారు. త్వరలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా చేపలు పట్టే వలలు, బోట్లు, ఇతర ఉపయోగపడే పరికరాలు అందించేలా ప్రతి పాదనలు రూపొందించాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో సుమారు 10 వేల మంది యానాది కులాలకు చెందిన గిరిజనులు ఉన్నారని, వీరిని గుర్తించి వివరాలు సేకరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నక్కల, పూసల కుటుంబాలకు కులదృవీకరణ పత్రాలు, రేషన్‌ కార్డులు ఆధార్‌ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అందిస్తున్న అన్ని పథకాలను చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ జిల్లా అధికారి యం రుక్మాంగదయ్య, మత్స్య శాఖ డిప్యూటి డైరెక్టర్‌ ఏ నాగరాజా, తదితరులు ఉన్నారు.