ప్రజాశక్తి-అనంతగిరి:తమ సాగు భూములు 110. ఎకరాలను గిరిజనేతరులు కబ్జాకు పాల్పడ్డారని, వాటిని రక్షించాలని గిరిజనులు శరీరంలో పూలదండలు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మండలంలోని నాన్ షెడ్యూలు రొంపల్లి పంచాయతీ పరిధి బూరుగా, చిన్నకోనెల గ్రామాలకు చెందిన 52 కుటుంబాల గిరిజనులు గురువారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి గిరిజన నేతరుల ఆధీనంలో ఉన్న భూములను తక్షణమే తమకు అప్పగించాలని, కబ్జాకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ సోమీల అప్పలరాజు, కొనపర్తి సింహాచలం మాట్లాడుతూ, తాత ముత్తాతల కాలం నుండి నేటి వరకు చిన్న కోనల రెవెన్యూ పరిధిలో సుమారు 110 ఎకరాల భూమిని బూరిగ చిన్నకోనెల గ్రామాలకు చెందిన 52 కుటుంబాలు పూర్వకాలం నుండి సాగు చేస్తూ జీవనాధారం కొనసాగిస్తున్నామని తెలిపారు.కొంతమంది మైదాన ప్రాంతాలకు చెందిన భూస్వాములు విశాలమైన సాగు భూములపై కన్నువేసి కబ్జాకు పాల్పడ్డారని తెలపారు. వెబ్ ల్యాండ్, అడంగల్‌లో తమ పేర్లను తొలగించి భూ స్వాముల పేర్లు నమోదైన విషయాన్ని తెలుసుకున్న అనంతరం 2020 సంవత్సరంలో తమకు అన్యాయం జరిగిందని అల్లూరి సీతారామరాజు జిల్లా సబ్ కలెక్టర్‌ని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి న్యాయం జరగలేదని, దీంతో ఆందోళన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.ఇప్పటికైనా తమ గ్రామంలో కలెక్టర్ సందర్శించి తమ భూములు తమకి అప్పగించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ఫిబ్రవరిలో నిరాహార దీక్ష చేపట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు భూరిగ పెంటయ్య,. రామారావు పాల్గొన్నారు.










