Jan 08,2023 00:28

ఆందోళన చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-పాడేరు: తమ జిరాయితీ భూములను దౌర్జన్యంగా దురాక్రమణ చేసేందుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమను బెదిరిస్తున్నారని అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ బూరిగ, చిన్నకోనెల గ్రామాల గిరిజనులు శనివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. జిల్లా ఉన్నత అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తూ గ్రామాలను విడిచి పోవాలని హెచ్చరిస్తున్నారని వారు భయాందోళన వ్యక్తం చేశారు, పూర్వకాలం నుంచి ఈ రెండు గ్రామాల్లో 72 గిరిజన కుటుంబాలు వారసత్వంగా తమకు లభించిన జిరాయితి భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో సుమారు 120 ఎకరాలు జిరాయితీ భూమి మెట్టు వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులు కలిగి జీవనోపాధిని పొందుతున్నామని వారు తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో తమకు అన్యాయం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు, వార్డు సభ్యుడు బడ్నాయిని పెంటయ్య, గ్రామ గిరిజనులు సోముల అప్పలరాజు, పోలమ్మ పాల్గొన్నారు.