ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి జిల్లాలో గిరిజన సంక్షేమానికి అధికారులు, ఉద్యోగులు అంకితం అవ్వాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక సిఏహెచ్ స్కూల్ ఆవరణలో గురువారం నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత గిరిజనుల కోసం మాత్రమే కొత్త జిల్లా ఏర్పడిందని, దీంతో, ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు పెరిగాయని తెలిపారు.అందుకు అనుగుణంగా మనమందరం కలిసి ప్రజల ఆర్థిక, సామాజిక సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని, ఆశించిన ఫలితాలు సాధించేందుకు అంకిత భావంతో పని చేయాలని సూచించారు.'జగన్న భూ హక్క, భూ రక్షా కార్యక్రమం' కింద ప్రతి రైతుకు భూమిపై శాశ్వత హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.35 వేల భూ రెవెన్యూ మ్యుటేషన్లు, సర్వే రికార్డుల ప్రక్షాళన లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 294 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసామని, ఏడాది చివరి నాటికి వెయ్యి గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. వివిధ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణంతో పాటు ఎయిర్టెల్, బిఎస్‌ఎన్‌ఎల్, జియో నెట్‌వర్క్‌ల సేవల కోసం 2,129 సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో వీటి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గంజాయి దాదాపుగా నిర్మూలించామని, యువత సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా స్కిల్ హబ్, స్కిల్ కాలేజ్ ద్వారా అనేక ఉపాధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో నాడు-నేడు కింద 947 పాఠశాలలు, 127 అంగన్‌వాడీ కేంద్రాలు, 12 జూనియర్ కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 38 కోట్ల నిధులతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.58,456 మంది లబ్ధిదారులను గుర్తించి, అదనపు ఇళ్ల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, ఇప్పటికే మంజూరైన 17,118 ఇళ్లను ఈ ఏడాది పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అగ్రికల్చర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగంగా రూ. 1.36 కోట్ల సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసామని తెలిపారు. రైతులకు ఖరీఫ్‌లో రూ.374 కోట్లు, రబీలో రూ.206 కోట్లు పంట రుణాలు మంజూరు చేశామన్నారు. అనంతగిరి మండలం నుండి కొయ్యూరు మండలం వరకు, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో రంపచోడవరం నుంచి కొయ్యూరు వరకు నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో 2024 నాటికి ఇంటింటి కుళాయి ద్వారా ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల తాగునీరు అందించేందుకు రూ. 630 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. తాగునీటి అవసరాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం 1250 ప్రాజెక్టులను మంజూరు చేసిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యురాలు కె.భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ జె.శివ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు
స్థానిక తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల మైదానంలో కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కతిక ప్రదర్శనలు అలరించాయి.తలారి సింగి బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన స్కిట్ ఆకట్టుకుంది. తలారిసింగి బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రథమ, కేజీబీవీ విద్యార్థులు ద్వితీయ, తలారిసింగి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు.
శకటాల ప్రదర్శన
వ్యవసాయ శాఖ, ఉద్యానవన, ఆరోగ్యశాఖ, అమెరికన్ ఇండో ఫౌండేషన్, గిరిజన సహకార సంస్థ, పౌరసరఫరాలు, విద్యాశాఖ, డిఆర్‌డిఏ, వైయస్సార్ క్రాంతి పదం తదితర శకటాలను ప్రదర్శించారు.
ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు
వ్యవసాయ, ఉద్యానవన శాఖ గిరిజన సహకార సంస్థ, ఐసిడిఎస్, ప్రదర్శన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఒక యూనిట్ రూ.75000 విలువైన ఐదు యూనిట్ లను 60 శాతం రాయితీపై అతిధులు చేతుల మీదగా పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 3,708 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.1,07,93,00ల బ్యాంకు లింకేజ్ కల్పించి చెక్కును అందజేశారు.
విగ్రహాల ఆవిష్కరణ
తలారిసింగి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పిఓ రోణంకి గోపాలకృష్ణ, శాసనసభ్యులు కె.భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు.
కలెక్టరేట్‌లో...
స్వాతంత్య్ర సమరంలో మేధావుల ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ కషి చేయాలని సంయుక్త కలక్టర్ జే.శివ శ్రీనివాసు కోరారు. కలెక్టరేట్‌లో జరిగిన గణతంత్ర వేడుకలలో జేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డిసి వి.వి శర్మ, జిల్లా ఖజానాదికారి ప్రసాద్ బాబు, తహసిల్దార్లు చిన్ని కృష్ణ, బివి రామారావు, డిపిఆర్‌ఓ గోవింద రాజులు పాల్గొన్నారు.
ఐటిడిఎలో..
పాడేరుటౌన్: గణతంత్ర దినోత్సవాన్ని పాడేరు ఐటిడిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఐటిడిఎ కార్యాలయం ప్రాంగణంలో ఐటిడిఎ పిఒ ఆర్.గోపాలక్రిష్ణ జాతీయ జెండాను ఆవిష్కరిచారు. పోలీస్‌ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, గాంమల్లుదొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ఎపిఒలు వి.ఎస్. ప్రభాకరరావు, ఎం.వెంకటేశ్వరరావు, టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, ఇఇ డివిఅర్‌ఎం రాజు, ఎఒ హేమలత, ఎఎఒ శ్రీనివాసకుమార్, ఐటిడిఎ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










