Nov 19,2023 20:57

- జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్‌ సలాం

రాయచోటి : జిల్లాలో గిరిజనులకు, గిరిజన విద్యార్థులకు అందుబాటులో ఉండి గిరిజన సంక్షేమమే తమ లక్ష్యమని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్‌ సలాం పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో గిరిజనలకు, గిరిజన విద్యార్థులకు వసతులు, నాణ్యమైన భోజనం ఎలా అందించాలో ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖి.
జిల్లాలో పాఠశాలలు, వార్డెన్లు, విద్యార్థులు వివరాలు తెలపండి?
జిల్లాలో 12 గిరిజన గురుకుల పాఠశాల ఉన్నాయి. వాటిలో 1 ఆశ్రమ, 5 బాలికలు, 6 బాలుర పాఠశాలలు ఉన్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1799 మంది విద్యార్థులు ఉన్నారు. బాలికలు 845 మంది, బాలురు 954 మంది ఉన్నారు. 12 హాస్టల్లో ఉన్నాయి. నలుగురు రెగ్యులర్‌ వార్డెన్లు ఉన్నారు.
విద్యార్థులకు పుస్తకాలు ఇతర కిట్లు సరఫరా చేస్తున్నారా?
విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్‌, బూట్లు ఇతర వస్తువులను విద్యార్థులందరికీ సరఫరా చేస్తున్నాం.
వంట మనుషులు ఎంత మంది ఉన్నారు? ఖాళీలు ఏమైనా ఉన్నాయి?
జిల్లా వ్యాప్తంగా వంట మనుషులు 6 పోస్టులు మంజూరయ్యాయి. 2 ఖాళీలు ఉన్నాయి. రాయచోటి, సుందపల్లె ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నాయి.
జిల్లాలో గిరిజనుల జనాభా ఎంత?
జిల్లాలో గిరిజనుల మొత్తం జనాభా 67,325,స్త్రీలు 32,762, పురుషులు 34,563, నివాసాలు 492, ఆవాసాలు 18,550 మంది ఉన్నారు.
గిరిజనులకు ఏ విధమైన సాయం అందుతుంది?
వైఎస్‌ఆర్‌ చేయూత పథకం 45-60 మధ్య వయస్సు గల గిరిజన మహిళలకు, సంవత్సరానికి రూ.18,750 ప్రకారం 4 ఏళ్లకు గాను రూ.75 వేలు మంజూరు చేశాం.
గిరిజనుల మౌలిక వసతులు కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జగ్జీవన్‌ జ్యోతి పథకం కింద 0 నుండి 200 యూనిట్ల విద్యుత్‌ను ఇంటి అవసరాల నిమిత్తం ఉచితంగా సరఫరా చేయబడును.
గిరిజన పాఠశాలల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఉపకార వేతనాలు (జగనన్న విద్యా దీవెన) రూ.2.50 లక్షలు లోపు వార్షికాదాయం కలిగిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇబిసి, కాపు, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతుల కుటుంబాలకు చెంది, అర్హత కాలిగిన విద్యార్థులకు ఐటిఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ. ఆపై కోర్సులకు సంబంధించి, ప్రభుత్వ కళాశాలలో చదువు విద్యార్థుల వారి బోధన ఫీజులు సంబంధిత తల్లుల ఖాతాకు మంజూరు చేస్తాం. జగనన్న వసతి దీవెన పథకం కింద 75 శాతం హాజరు, అర్హతలు కలిగిన ఐటిజెఐ చదువుచున్న గిరిజన విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ చదువు విద్యార్ధులకు రూ.15 వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు విద్యార్థులకు రూ.20 వేలు వారి ఆహార, వసతి ఖర్చుల నిమిత్తం మంజూరు చేస్తాం. గిరిజన విధ్యార్ధుల ఉన్నత విద్య కొరకు, విదేశాలలోని విద్యను అభ్యసించుటకు 200 ఉన్నత స్థాయి యూనివర్సిటీలలో పిజి, పిహెచ్‌డి, ఎంబిబిఎస్‌ కోర్సులకు గాను జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఆర్థిక సహాయం మంజూరు చేస్తాం. దరఖాస్తుదారుని కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. ధరఖాస్తుదారుని వయస్సు 35 సంవత్సరాల్లోపు ఉండాలి. కళాశాల నిర్ణయించిన ట్యూషను ఫీజుకు 100 శాతం అర్హులు. ఆకాశ మార్గం (విమాన ప్రయాణం)లో ఒన్‌వే ఎకానమి క్లాట్‌ టికెట్‌ మొత్తం, వీసా ఫీజు చెల్లిస్తాం. ఆర్థిక సహాయాన్ని 4 కంతులలో విడుదల చేస్తాం. ఒక కుటుంబములో జీవిత కాలంలో ఒకరికి మాత్రమే అర్హులు. ధరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీగా 30-06-2023గా నిర్ణయించాం. ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులను రాష్ట్ర స్థాయి కమిటీ ద్వారా ఎంపికవుతారు.