ప్రజా సమస్యలు పట్టని జగన్ సర్కారు
పర్యాటకులకు నిలువునీడ కరువు!
బస్‌స్టాండ్ లేక మన్యవాసుల అవస్థలు
కనీస సౌకర్యాల్లేకున్నా పట్టని ప్రభుత్వం
సిపిఎం జిల్లా నేత మట్ల వాణిశ్రీ
ప్రజాశక్తి -మారేడుమిల్లి : సవాలక్ష సమస్యలతో మన్యవాసులు అవస్థలు పడుతున్నా సిఎం జగన్ నేతృత్వంలోని వైసిపి సర్కారుకు పట్టడం లేదని సిపిఎం, గిరిజన సంఘం నేతలు మండిపడుతున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన మారేడుమిల్లిలో బస్‌షెల్టర్ లేక స్థానికులు, ప్రయాణికులతోపాటు ఈ ప్రాంత సందర్శనకు వచ్చే పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నారని, తక్షణమే పాత బస్‌స్టాండ్‌ను పునరుద్ధరించి, వినియోగంలోకి తేవాలని కోరారు. ఈమేరకు గురువారం సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలోఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్ల.వాణిశ్రీ మాట్లాడుతూ, మండల కేంద్రంలోవాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వాటిని రోడ్డుపైనే నిలపాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రయాణికులు సైతం బస్సుల కోసం ఎండావానల్లో రోడ్డుపైనే నిరీక్షించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మారేడుమిల్లిలో ఆర్‌టిసి బస్ కాంప్లెక్స్ ఉన్నప్పటికీ అక్కడకు వాహనాలు వెళ్లకపోవడంతో పదేళ్లుగా నిరుపయోగంగా ఉందన్నారు. వివిధ కేసుల్లో పోలీసులు సీజన్ చేసిన వాహనాల డంపింగ్ ప్రాంతంగా ఇది మారిపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. తక్షణమే ఆర్‌టిసి బస్‌స్టాండ్‌లో ఉన్న వాహనాలను బయటకు తీసి, బస్ కాంప్లెక్క్‌కు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవడం ద్వారా ప్రజల కష్టాలకు విముక్తి కల్పించాలని వాణిశ్రీ డిమాండ్ చేశారు. దాన్ని పునరుద్ధరించలేని పరిస్థితుల్లో కొత బస్‌స్టాండ్‌ను నిర్మించి, ప్రయాణికులు రోడ్డుపైనే వేచియుండే దౌర్భాగ్య పరిస్థితి నుంచి విముక్తి కల్పించి, నిలువనీడ ఏర్పాటు చేయాలని కోరారు.ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టకుంటే ప్రజలను సమీకరించి సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
మండలంలో తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం ఇలా అన్ని విభాగాల్లో సమస్యలు తిష్టవేసి ఉన్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ పేరుతో వైసిపి ప్రభుత్వం పైపై మెరుగులు దిద్దుతుందే తప్ప ప్రజాసమస్యల పరిష్కారానికి గానీ, శాశ్వత సౌకర్యాల కల్పనకుగానీ కనీస చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లిరెడ్డి, గిరిజన యువత పాల్గొన్నారు.










