Jun 17,2023 00:32

నినాదాలు చేస్తున్న గిరిజనులు


ప్రజాశక్తి-రోలుగుంట:జగనన్న భూ రీ సర్వేలో గిరిజన భూములు గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని శుక్రవారం రోలుగుంట మండలం పనసలపాడు గ్రామంలో ఆదివాసి గిరిజనులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు మాట్లాడుతూ, రోలుగుంట మండలం పనసలపాడు రెవెన్యూ పరిధిలో 12 ఆదివాసి గిరిజన భగతా కుటుంబాలు(ఎస్టీ) తన వారసత్వ భూములో వరి, చెరుకు వంటి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. సర్వేయర్లు రైతుల భూమి వివరాలతో పాటు ల్యాండ్‌ పార్సల్‌ నెంబర్‌ (ఎల్‌పిఎన్‌) రైతులకు అందజేయాలని, సర్వే పూర్తయిన తర్వాత(డిఎల్‌ఆర్‌) క్రాఫ్ట్‌ ల్యాండ్‌ రిజిస్టర్‌ రెవిన్యూ గ్రామంలో 9(2) నోటీస్‌ ఇచ్చి వారి అంగీకర పత్రం సంతకం పెట్టి ఇవ్వాల్సి ఉందన్నారు. 15 రకాలైనటువంటి రూల్స్‌ పాటించవలసి ఉంటుందని తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు, తహశీల్దార్‌ కుమ్మక్కై గ్రామసభ పెట్టకుండా సర్వే నెంబర్‌ 8-1. 6-9 లో ఎస్‌ఎఫ్‌ఏ రికార్డు ప్రకారంగా గిరిజనుల పేరు మీద ఉందని, జగనన్న భూ-రీ సర్వేలో గిరిజనేతరులు మాజీ సర్పంచ్‌, వైసిపి నాయకులు తమటపు సత్యనారాయణ, ఒక నలుగురికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇచ్చారన్నారు. సర్వే నెంబర్‌ 6-1లో 10 గిరిజన కుటుంబాలు గత వారసత్వంగా సాగు చేస్తున్నారని, వీరికి పట్టాలు ఇవ్వాల్సింది పోయి గిరిజనేతలకు ఇవ్వడం ఏమిటన్నారు. ఈ విషయంపై నర్సీపట్నం ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గిరిజనేతలకు పట్టా భూములను డిస్ప్లేండ్‌ నమోదు చేశామని, పట్టాలు గిరిజనేతలకు ఇవ్వలేదని చెబుతున్నారన్నారు. ఆర్‌ఒఆర్‌ రిజిస్టర్‌ ప్రకారంగా గిరిజనేతలకు పట్టాలు ఇచ్చినట్టుగా చూపిస్తున్నారని, తక్షణమే రద్దు చేయాలని, దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ సమగ్రమైన విచారణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజనులు గెమ్మెలి చిన్నబ్బాయి, జి.మచ్చికొండ, గెమ్మెలి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.