Jun 01,2023 00:00

నినాదాలు చేస్తున్న నాయకులు, గిరిజనులు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:రోలుగుంట మండలంలో గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం 5వ షెడ్యూల్‌ సాధన కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కే గోవిందరావు మాట్లాడుతూ, రోలుగుంట మండలం పనసలపాడు రెవెన్యూ పరిధిలో 12 కుటుంబాలు ఎస్టీ భగత తెగలకు చెందిన వారు గత 50 సంవత్సరాల నుండి ఇదే గ్రామంలో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అటువంటి వీరి భూములను గిరిజనేతరులకు ఇవ్వడం దారుణమ న్నారు. గిరిజనుల భూముల్లో జగనన్న భూ రీ సర్వే పేరుతో సర్వేలు చేసి గిరిజనేతరులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, గిరిజనుల పేరుతో రికార్డులు ఉన్నాయని, అలాంటిది గిరిజనేతలకు పట్టాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సర్వే నెంబర్‌ 6-9లో 1-43 సెంట్ల భూమి తమటాపు సత్యనారాయణ మాజీ సర్పంచ్‌ పేరు మీద పట్టా ఇచ్చారని, ఇది ఎలా సాధ్యపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్‌ 6-1లో పది మంది ఆదివాసి గిరిజనులు 50 సంవత్సరాల నుంచి భూములు సాగు చేస్తున్నారని, పట్టాలు మాత్రం సాగులో లేని భగవతి మైధిలి కుమారి పేరు మీద పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఎలా ఇచ్చారో అధికారులకే తెలియాలన్నారు. పనసలపాడు గ్రామంలో గ్రామసభ పెట్టలేదని, (డ్రాఫ్ట్‌ ల్యాండ్‌ రిజిస్టర్‌ )డిఎల్‌ఆర్‌ లబ్ధిదారులకు తెలియపరచకుండా రికార్డులు తయారు చేసేశారన్నారు.తప్పుడు పద్ధతిలో గిరిజన భూముల్లో గిరిజనేతలకు ఇచ్చిన పట్టాలు రద్దు చేయాలని, రోలుగుంట తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సమగ్రమైన విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డిఓ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గేమిల చిన్నబ్బాయి, గేమిలా నూకినాయుడు, గేమిల మెచ్చుకొండ తదితరులు పాల్గొన్నారు.