Oct 16,2022 23:40

మాట్లాడుతున్న అప్పలనర్స,

ప్రజాశక్తి-పాడేరు: షెడ్యూల్‌ ఏరియాలో కండిషనల్‌ అపాయింట్మెంట్‌ బేసిక్స్‌లో నియమి తులైన గిరినేతర ఉపాధ్యాయులకు ప్రమోషన్‌ ఇవ్వడాన్ని అడ్డుకుంటామని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. పాడేరు గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్‌ ఏరియాలో స్థానిక గిరిజనులకు 100 శాతం ఉద్యోగ నియామక, పదోన్నతుల జిఒ 3 సుప్రీంకోర్టు రద్దు తీర్పు గిరిజనులకు సాంప్రదాయకంగా సంక్రమించిన హక్కులకు ఇబ్బంది కరంగా మారుతుందన్నారు.ఈ మేరకు తక్షణమే ఆ తీర్పును పున్ణపరిశీలించాలని కోరుతూ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ రివ్యూ పిటిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఐదో షెడ్యూల్‌, పార్లమెంటు ఆమోదించిన పీసా చట్టం, రాజ్యాంగం 9వ షెడ్యూల్డ్‌లో పొందుపరిచిన షెడ్యూల్డ్‌ ఏరియా భూ బద్దలాయింపు చట్టం 1/70 చట్టం లక్ష్యాలకు భిన్నమైన తీర్పుతో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు దోపిడీకి గురవుతారని, గిరిజన సాంప్రదాయ హక్కులకు భంగం కలుగుతున్నందున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలని గిరిజన సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ కూడా నిర్వహించిందని, ప్రస్తుతం పెండింగ్‌ లో ఉందన్నారు.రంపచోడవరం ఐటిడిఎ పరిధిలో గిరిజనేతర ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి జగన్‌ సర్కార్‌ పూనుకోవడం గిరిజనులకు ద్రోహం చేయడమేనన్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసి మరోపక్క గిరిజనులకు సంక్రమించిన 100శాతం రిజర్వేషన్‌ హక్కులను హరిస్తూ ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. గిరిజనుల రిజర్వేషన్‌, ప్రయోజనాలను కాపాడలేని గిరిజన సలహా మండలి సభ్యులైన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ఎమ్మెల్యేలు తమ సొంత ఆస్తులను కూడా పెట్టుకోవడం మానేసి 100శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ సాధనకు పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వివిధ శాఖల్లో కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ పోస్టులన్నీ గిరిజనేతరులతో భర్తీ చేస్తున్నా గిరిజన ప్రజాప్రతినిధులు కనీసం స్పందించ లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో 100శాతం ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు స్థానిక గిరిజనులకే కల్పించాలని గిరిజన, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి.లక్కు, కార్యదర్శి కె.పృధ్వీరాజు పాల్గొన్నారు.