Nov 15,2022 23:45

సీజ్‌ చేస్తున్న అధికారులు

అఖిలపక్షం ఆందోళనలతో అధికారుల్లో కదలిక
ప్రజాశక్తి -హుకుంపేట:ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి, మన్యంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను ఆదిలోనే గుర్తించి, వాటిని అడ్డుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వాటిని సీజ్‌ చేయడం, ఇతరత్రా చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనముండదన్నారు కొన్నాళ్ల తర్వాత వాటిని అక్రమార్కులకు అప్పగిస్తున్న ఉదంతాలు పలు చోటుచేసుకున్న నిర్మాణాలను గుర్తించిన వెంటనేకూల్చేయాలని డిమాండ్‌ చేశారు.
మండల కేంద్రంతోపాటుపలు గ్రామాల్లో1/70, ఇతర గిరిజన చట్టాలను ఉల్లంఘించి గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేస్తూనే ఉన్నారని అఖిలపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. జీవనోపాధికి, నివాసానికి నిజమైన గిరిజనులు చిన్నపాక వేస్తే ఆగమేఘాలమీద వచ్చి వాటిని అడ్డుకుంటున్న రెవెన్యూ, పంచాయతీ అధికారులు, గిరిజనేతరులు అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తులనుపట్టించుకోకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందాక, తాత్సారం చేస్తూ విచారణ జరిపి, వాటిని సీజ్‌ చేస్తున్నారని అంటున్నారు. నిర్మాణాలు అక్రమమని నిర్థారణ జరిగాక కూల్చేయాలని, లేకుంటేతామే కూల్చేస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.
తహశీల్దార్‌ వివరణ
దీనిపై తహశీల్దార్‌రాజ్యలక్ష్మి వివరణ కోరగా, ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి గిరిజనేతరులు నిర్మాణాలు చేపట్టడం అక్రమమని, దీనిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. మండల కేంద్రంలో బుడ్డకొండమ్మ అనే గిరిజనేతరురాలి అక్రమ నిర్మాణాన్ని సబ్‌కలెక్టర్‌ ఆదేశాలతో సీజ్‌ చేసి, అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.ఆర్‌ఐ జి.రంగారావు, విఆర్‌ఒ కొండబాబు ఉన్నారు.