గిరిజనానికి రక్షణగా ఉన్న చట్టాల ఉల్లంఘణ ఓవైపు.. రాజ్యాంగం కల్పించిన హక్కుల కాలరాత మరోవైపు.. జీవనాధారమైన అడవుల నుంచి ఆదివాసీలను దూరం చేసే విధానాలు ఇంకోవైపు.. అమాయక గిరిజనానికి కాస్తోకూస్తో మేలు చేకూరుస్తున్న రిజర్వేషన్లను సైతం కొల్లగొట్టే కుట్రలు మరోవైపు.. ఇలా నలుదిక్కులా గిరిజనానికి ఉచ్చుబిగించి, ఊపిరిసల్పకుండా చేసే పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరుబాట సాగిస్తోంది.. ఎపి గిరిజన సంఘం. ఏజెన్సీ ప్రాంతంలో అమాయక గిరిజనానికి అండగా నిలుస్తూ, నిత్యం చైతన్యం చేస్తూ, ఆదివాసీల అభివృద్ధికి వారధినవుతోంది. కేంద్ర, రాష్ట్ర పాలకుల అణచివేత చర్యలను ప్రతిఘటించి, గిరిజనులకు బాసటనిస్తోంది. అలాంటి గిరిజన సంఘం మహాసభ... గురు, శుక్రవారాల్లో జరగనుంది. గత పోరాటాలపై సమీక్షించుకుని, భవిష్యత్తు పోరాట కార్యాచరణను రూపొందించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
ప్రజాశక్తి - సాలూరు/కురుపాం
2020 జనవరి రెండో తేదిన జరిగిన ఎపి గిరిజన సంఘం ఆరో జిల్లా మహాసభలో తీసుకున్న కర్తవ్యాలను అమలు చేసి, గిరిజన హక్కుల రక్షణకు ముందుండి పోరాడింది. అందులో భాగంగానే రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా ముందంజలో ఉన్న బోయ, వాల్మీకులను ఎస్‌టిలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున గిరిజన సంఘం పోరాడింది. దీనిపై గిరిజనులను సమీకరించి మన్యం బంద్ విజయవంతంగా చేపట్టింది. ఐటిడిఎల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలను గిరిజనులకే కేటాయింపునకు సంబంధించిన జిఒ నెంబర్ 3 రద్దుకు వ్యతిరేకంగా దశల వారీగా ఆందోళనలు చేపట్టింది. ఐటిడిఎల వద్ద రిలే నిరాహార దీక్షలు నడిపింది. గిరిజన ప్రాంతంలో జీడి పంటకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ 1500మంది గిరిజనులతో కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించింది. సాలూరు మండలం కురుకూటిలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా గిరిజన సంఘం ఆందోళన కొనసాగించింది. గిరిజనుల నుంచి వన్‌టైం సెటిల్మెంట్ కింద గృహ నిర్మాణ శాఖ వసూళ్లకు వ్యతిరేకంగా పోరాడింది. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు భూములిచ్చిన గిరిజన రైతులకు పరిహారం చెల్లించాలని, భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాడింది. దీనిపై పాలకొండ ఆర్‌డిఒ జోక్యం చేసుకుని భూమికి భూమి ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. భామిని ప్రాంతంలో గిరిజనులు ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తే రిజర్వ్ ఫారెస్ట్ భూములని అటవీ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోరాటం చేపట్టింది. గిరిజనులు వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎల వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యాన ధర్నాలు నిర్వహించారు. సవర భాషా వాలంటీర్లను రెగ్యులర్ చేయాలని, వేతనం బకాయిలు చెల్లించాలని గిరిజన సంఘం పోరాడింది. మన్యం జిల్లాలో ఏనుగుల బెడద నుంచి గిరిజనులను, పంటలను కాపాడాలని పోరుబాట పట్టింది.
పాచిపెంట మండలం ఒడిసెలమడ గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని ఆందోళన చేపట్టింది. 1/70 చట్టాన్ని రద్దుచేసి గిరిజన ప్రాంతాన్ని అంతటిని మైనింగ్ పేరుతో కార్పొరేట్లకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేసింది. కురుపాం నియోజకవర్గంలో పూర్ణపాడు-లాబేసు వంతెన వెంటనే పూర్తి చేయాలని, గిరిజన గ్రామాలకు అన్నిటికీ లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని, జీడిపిక్కలు, చింతపండు ప్రాసెస్ యూనిట్లు పెట్టాలని, గిరిజన ప్రాంతంలో ఉన్న చెక్ డాములు వెంటనే పూర్తి చేయాలని, విద్య, వైద్యం మెరుగుపర్చాలని.. ఇలా అనేక సమస్య లపై గిరిజన సంఘం పోరాటాలు సాగించింది. వీటిలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇంకా కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ సమస్యలపై మహాసభలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నారు.
మహాసభకు ముస్తాబైన వేదిక
కురుపాం : గిరిజన సంఘం ఏడో జిల్లా మహాసభకు కురుపాం వేదికైంది. స్థానిక ఆర్‌టిసి కూడలి వద్ద గురు, శుక్రవారాల్లో జరిగే మహాసభకు జిల్లాలోని అన్ని గిరిజన మండలాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున హాజరుకావాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి మండంగి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు మండంగి రమణ కోరారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆర్‌టిసి కాంప్లెక్స్ నుండి రావాడ కూడలి వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అనంతరం ప్రతినిధుల సభ కాంప్లెక్స్ ఆవరణలో జరుగుతుంది. ఈ మహాసభకు ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ అధ్యక్షులు మిడియం బాబూరావు, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, విశాఖ జిల్లా అధ్యక్షులు అప్పారావు, సిఐటియు రాష్ట్ర నాయకులు కె.సుబ్బరావమ్మ హాజరు కానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లలో గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, కెవిపిఎస్ నాయకులు రెడ్డి వేణు, పి.తిరుపతిరావు, గంగరాజు, జగదీష్, కొల్లి గంగునాయుడు, అవినాష్, మండంగి వెంకట్రావు, ఎన్.సింహాచలం నిమగమై ఉన్నారు.










