ఆర్చరీ శిక్షణ విద్యార్థులకు క్రీడాపరికరాలు ఇవ్వాలి
గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర
ప్రజాశక్తి -అరకులోయ రూరల్ : అరకులోయ స్పోర్ట్స్ స్కూల్‌లో శిక్షణ పొందుతున్న గిరిజన ఆర్చరీ విద్యార్థులకు ప్రభుత్వపరంగా ఉచితంగా క్రీడాపరికాలను అందజేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర కోరారు. గిరిజన యువతను క్రీడల్లో ప్రోత్సాహిస్తే, వారి విశేషంగా రాణించి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించే సత్తా వారిలో ఉందన్నారు. మంగళవారం అరకులోయ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించారు.వచ్చే నెలలో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనేందుకు శిక్షణ పొందుతున్న రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఏకలవ్య పాఠశాలలకు చెందిన 30మంది గిరిజన విద్యార్థినీ, విద్యార్థులను కలుసుకుని వారితో మాట్లాడారు. స్పోర్ట్స్‌స్కూల్‌లో శిక్షణ పొందుతున్న విధానంపై వారిని అడిగి తెలుసుకున్నారు. జాతీయపోటీల్లో బాగా రాణించి పతకాలను సాధించాలని ఆకాంక్షిస్తూ, వారందరికీ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ, విలువిద్యలో శిక్షణ పొందుతున్న గిరిజన విద్యార్థులకు సంబంధిత క్రీడాకిట్లు కొనాలంటే సుమారు రూ.ఎనిమిది వేలు ఖర్చు అవుతోందని, అంతమొత్తం ఖర్చుపెట్టే స్థోమత వారికి లేదన్నారు. ఈ నేపథ్యంలో వారిక అవసరమైన క్రీడా సామగ్రిని ఐటిడిఎ ద్వారా ఉచితంగా అందజేయాలన్నారు. ఆర్చరీ క్రీడాకారులతోపాటు ఇతర క్రీడల్లో శిక్షణ పొందే గిరిజన విద్యార్థులకు క్రీడాప రికరాలు బూట్లు, యూనిఫాం, ఉచితంగా అందించాలని కోరారు. గిరిజన యువతకు అవసరమైన సౌకర్యాలను కల్పించి, క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచేలా శిక్షణనిస్తే, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలను సాధించే సత్తా వారిలో ఉందన్నారు. అరకులోయ స్పోర్ట్స్ కాలేజీని అఫ్‌గ్రేడ్ చేసి కాలేజీ విద్యార్థులకు కూడా శిక్షణనిచ్చే చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పిఇడిలు సింహాచలం నాయుడు, సూరిబాబు, గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్ కన్వీనర్ ఎస్. గంగ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె.ధనలక్ష్మి, బుల్లెమ్మ కె.కృష్ణ పాల్గొన్నారు.










