గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనలో సిఎం జగన్
వర్సిటీని మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ
ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి :గిరిజనులకు ప్రపంచ స్థాయి ఉన్నత విద్య అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీ పడతారని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చినమేడపల్లిలో 561.88 ఎకరాల్లో రూ.834 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి జగన్, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం వద్ద జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూడేళ్లలో ఈ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మంజూరైన ఈ వర్సిటీ గిరిజనుల జీవితాలను ములుపు తిప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న ప్రపంచంలో గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచడానికి, దోపిడీ నుంచి రక్షించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు, వైద్యారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం జరుగుతోందని వివరించారు. నామినేటెడ్ పదవులు, ఉద్యోగాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు 50 శాతం కేటాయించే విధంగా ప్రత్యేక చట్టం చేశామన్నారు. 1,53,820 గిరిజన కుటుంబాలకు 3,22,538 ఎకరాల సంబంధించి ఆర్‌ఒఎఫ్‌ఆర్ డికెటి పట్టాలు మంజూరు చేశామని తెలిపారు. గిరిజన రైతులకు రైతు భరోసా వర్తింపజేశామన్నారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక ఎస్‌టి కమిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు.
క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనల కేంద్రంగా సిటియు : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఈ సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీని క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనల కేంద్రంగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం మెరుగుపడతాయని పేర్కొన్నారు. పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్‌లో కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉందన్నారు. ఈ రెండు యూనివర్సిటీలూ పరస్పర సహకారంతో గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేస్తాయని పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తోన్న విద్యా సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయన్నారు. ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించడం భాషాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పని చేస్తున్నాయన్నారు. సభలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రసంగించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బత్స సత్యనారాయణ, అరకు ఎంపి జి.మాధవి, పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.










