Jul 10,2023 21:52

సభలో మాట్లాడుతున్న గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు అప్పారావు

ప్రజాశక్తి - సాలూరురూరల్‌ : విభజన హామీలో భాగంగా ఈ జిల్లాకు వచ్చిన గిరిజన యూనివర్సిటీ ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తారని గిరిజన సంఘం నాయకులు ప్రశ్నించారు. మండలంలోని మామిడిపల్లిలో గేమ్మెల బాబాయి ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన మహాసభ జరిగింది. ఈ సభలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సీదరపు అప్పారావు మాట్లాడుతూ విభజన హామీలో భాగంగా వెనుకబడిన గిరిజన బిడ్డలకు ఉన్నత విద్య కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసిందని, విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నా నేటికీ ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడంలో పోటీపడుతున్నాయని విమర్శించారు. బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చడానికి ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయని అన్నారు. అదే జరిగితే నిజమైన గిరిజన బిడ్డలకు ఉపాధి అవకాశాలు కనుమరుగు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాల్లేవని, వైద్యం కోసం 10 కిలోమీటర్లు డోలీలు కట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ లీజులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సాగు భూములకు, అటవీ బంజరు భూములకు పట్టాలు ఇవ్వడానికి సర్వేలు చేసినా, నేటి వరకు పూర్తిస్థాయిలో పట్టాలు పంపిణీ కాలేదనీ, తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతన 10మంది సభ్యులతో మండల కమిటీ ఎన్నికైంది. అధ్యక్షులుగా వంతల సుందర్రావు, కార్యదర్శిగా గెమ్మేల జానకీరావు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో గిరిజన సంఘం సీనియర్‌ నాయకులు సూకురు గంగయ్య, మండల కమిటీ సభ్యులు కంచూరి బంగార్రాజు, సీదరపు సుందర్రావు, గిన్నెల తిరుపతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు జన్ని ఈశ్వరరావు , గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : పోరాటాల ద్వారానే గిరిజన సమస్యల పరిష్కారానికి వీలుంటుందని ఎపి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి మండంగి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో గిరిజన మండల మహాసభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కులు చట్టాలు పరిరక్షణకై ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మండల అధ్యక్షులుగా బిడ్డిక శంకర్‌ రావు, కార్యదర్శి పువ్వల తిరుపతిరావు, సహాయ కార్యదర్శి మండంగి సన్యాసిరావు, ఉపాధ్యక్షులుగా బిడ్డిక రమేష్‌, కోశాధికారిగా బిడ్డిక ఆడిత్‌తో పాటు 14 మంది ఎన్నికయ్యారు. ఈనెల 20,21 తేదీల్లో కురుపాంలో జరగబోయే గిరిజన సంఘం 7వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మండంగి రమణ ఉన్నారు.