ప్రజాశక్తి-అరకురూరల్:అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గిరిజన వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్శ విమర్శించారు. శుక్రవారం అరకువేలి గిరిజన సంఘం కార్యాలయంలో మండల కార్యదర్శి కె.రామారావుతో కలిసి విలేకర్ల సమావేశంలో పి.అప్పలనర్శ మాట్లాడుతూ,బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు కనీసం 25 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నా కేటాయించిన వాటిలో కూడా సగానికి సగం కోతలు పడుతున్నాయన్నారు. గత సంవత్సరం 20 వేల కోట్లు కేటాయించారని, సాధారణ పథకాలకు మళ్ళించారని తెలిపారు.గిరిజన సబ్ ప్లాన్ చట్టం ప్రకారం రూ.16140 కోట్లు కేటాయించాల్సి ఉందని, 10 వేల కోట్ల కోత విధించారన్నారు.కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రస్తావన లేదని అన్నారు. ఈ నిధులతో పోలవరం పునరావాసం, వెలిగొండ, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యే జాడ లేదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల ప్రస్తావన లేదని తెలిపారు. 4 ఏళ్ళ క్రితం చెప్పిన వాటిని పునశ్చరణ చేయడం తప్ప కొత్త పథకాలేవీ ప్రకటించలేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రజానీకం వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఉపాధి కల్పనకు, పారిశ్రామిక అభివృద్ధికి వెచ్చించింది నామమాత్రమే అని అన్నారు. కనీసం డిఎస్సీ పరీక్షలు పెడతామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు ఈ బడ్జెట్‌లో ప్రస్తావన లేదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా 10శాతం కింద రూ.500 కోట్లు కేటాయించాల్సి ఉందని, అటువంటి ప్రతిపాదనలేవీ బడ్జెట్‌లో లేవన్నారు.కేటాయించిన నిధులలో కూడా ఎక్కువ భాగం మెటీరియల్ కాంపొనెంట్‌కే వెచ్చించి కూలీలు చేసే పనికి కోత పెట్టారన్నారు. జగనన్న ఇళ్ళకు ఉపాధి నిధులను మళ్లించారన్నారు. గతంలో ప్రకటించిన నవరత్నాల కోసం తప్ప కొత్త రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరుకు కేటాయింపులు లేవని విమర్శించారు. తొలగించిన వేలాది మంది పించన్లు పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. 6 స్టెప్స్ ఫార్ములా చూపి పెన్షన్లు తొలగించడం దుర్మార్గమన్నారు. ఉన్నత విద్యకు నిధులు తగినంత లేవని అప్పలనర్స తెలిపారు.










