Aug 18,2020 07:50

రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 లోని సెక్షన్‌ 93, షెడ్యూల్‌ 13(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనేక విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు...ఉభయ తెలుగు రాష్ట్రాల లోనూ కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలి. అదేం విచిత్రమో...నేటికీ కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు. యూనివర్సిటీని అరకులో ఏర్పాటు చేయాలని ముందు ప్రతిపాదించారు. తరువాత కొత్తవలస దగ్గర స్థల సేకరణ చేశారు. జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 'అక్కడ కాదు.. సాలూరులో..' అన్నారు. వెరసి ఆరు సంవత్సరాలైనా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇది చాలదన్నట్లు తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు 'ఎక్కడా కాదు. భోగాపురంలో. దీనికోసం సేకరించిన స్థలంలో ఏర్పాటు చేయాల'ని మరో కొత్త వాదన తెర పైకి తీసుకొచ్చారు. భోగాపురంలో ఈ స్థల సేకరణ ఎప్పుడు, ఎలా జరిగిందన్నది రహస్యమే.
నిపుణుల కమిటీ వివిధ ప్రదేశాలను పరిశీలించి, ఆఖరుకు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం లోని రెల్లి రెవిన్యూ గ్రామంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనికనుగుణంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.ఐదు కోట్లు కేటాయించి 525.08 ఎకరాల భూమిని కొంత ప్రభుత్వ భూమి, మరి కొంత రైతుల నుండి సేకరించి, స్థలం చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించింది. ఎట్టకేలకు కేంద్ర మానవ వనరుల శాఖ నవంబర్‌ 2018లో దీనికి ఆమోద ముద్ర వేసింది. అయితే దీని నిర్మాణం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. 2019లో ఆంధ్ర యూనివర్సిటీని దీనికి మెంటార్‌ యూనివర్సిటీగా ప్రకటించి, విజయనగరం లోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌ నుండి కొన్ని తరగతులను మొక్కుబడిగా తాత్కాలిక గెస్టు ఫాకల్టీతో ప్రారంభించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.1100 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర నిపుణుల బృందం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కేటాయించింది శూన్యం.
ఒక గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు గిరిజనాభివృద్ధికి ఎలా సహకరిస్తుందో తెలియాలంటే ప్రస్తుతం దేశంలో మధ్యప్రదేశ్‌ లోని అమర్‌ కంటక్‌ లో ఉన్న ఒకేఒక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలి. దీని ఏర్పాటుకు 2007లో కేంద్ర ప్రభుత్వం 'ఇందిరా గాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ చట్టం' చేసింది. 400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ యూనివర్సిటీలో 30 డిపార్ట్‌మెంట్లు, డిగ్రీ నుండి పి.జి, రీసెర్చ్‌ వరకు వివిధ కోర్సులు వున్నాయి. మొత్తం క్యాంపస్‌లో గత సంవత్సరం 2628 విద్యార్ధులు చేరగా అందులో వారిలో మహిళలు 46.65 శాతం, గిరిజనులు 41.24, దళితులు 12.21, ఓబిసి లు 24.42 శాతం అంటే మొత్తం వెనుకబడిన తరగతుల వారు77.87 శాతం మంది ఉన్నారు. దీనినిబట్టి ఈ యూనివర్సిటీ వల్ల అత్యంత వెనుకబడ్డ విద్యార్ధులకు, మహిళలకు లాభం చేకూరుతోందని అర్ధమవుతోంది. గిరిజన భాషలను, సాంప్రదాయాలను, సంస్కృతిని పరిరక్షించే ప్రత్యేక అధ్యయనాలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రత్యేక డిపార్ట్‌మెంట్ల ద్వారా గిరిజన భాషా నిఘంటువులు, లిపి లేని గిరిజన భాషలకు ప్రత్యేక లిపిని రూపొందించే కృషి చేస్తున్నారు.
విద్యార్ధులకు అవసరమైన హాస్టలు సదుపాయాలు, లైబ్రరీ, నైపుణ్యాభివృద్ధి సంస్థలు అందుబాటులో వుండడంతో విద్యార్ధులకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగు పడుతున్నాయి. కేవలం విద్యార్ధులకే గాక ఆ ప్రాంతం లోని గిరిజనులకు తేనె తయారీ, సోయా బీన్స్‌ పాలు, ఫ్యాషన్‌ టెక్నాలజీ వంటి వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడంతో వారికి కూడా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఫలితంగా మొత్తం ఆ ప్రాంత అభివృద్ధికి ఈ యూనివర్సిటీ ఏర్పాటు ఉపయోగపడుతోంది.
అటువంటి గిరిజన వర్సిటీని ఇక్కడ కూడా మరింత మెరుగ్గా ఏర్పాటు చేస్తే...మొత్తం రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహాయకారిగా వుంటుంది. అయితే ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ తో సహా అన్నీ ఎగ్గొట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీ పట్ల కూడా అదే వైఖరి ప్రదర్శిస్తూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోంది. రాష్ట్ర బిజెపి నాయకులైనా కేంద్రంలో తమ కున్న పలుకుబడిని ఉపయోగించి మిగిలిన అంశాలతో పాటు గిరిజన యూనివర్సిటీకి అవసరమైన నిధులు, సిబ్బంది నియామకం వంటివి తక్షణం మంజూరయ్యేలా చూస్తే రాష్ట్రానికి లాభం చేకూరుతుంది.
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం మోడీ ప్రభుత్వ విధానం. విద్యా రంగంలో కూడా విదేశీ పెట్టుబడులను, విశ్వ విద్యాలయాలను ఆహ్వానించడం జాతీయ విద్యా విధాన లక్ష్యం. ఇటువంటపుడు గిరిజన యూనివర్సిటీ లాంటి ఒక ఉన్నత విద్యా సంస్థను కేంద్ర ప్రభుత్వ నిధులతో స్థాపించాలన్న అంశం కేంద్ర ప్రభుత్వానికి అస్సలు మింగుడు పడడం లేదు. అందుకే రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ...ఆరేళ్లు గడిచినా గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుకు ఏ చర్యలూ చేపట్టడం లేదు. మిగిలిన సంస్థలకు సరిపడ నిధులూ కేటాయించడంలేదు.
ఇది కేంద్రీయ విద్యా సంస్థ కాబట్టి మామూలుగా గిరిజనులకుండే సాధారణ రిజర్వేషన్లు మాత్రమే వర్తిస్తే గిరిజనులకు దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అమర్‌ కంటక్‌ లో ఎక్కువ మంది గిరిజనులు చేరడానికి కారణం అది గిరిజన ప్రాతంలో ఉండడమే. కానీ ఇక్కడ ఏర్పాటు చేయబోయే గిరిజన యూనివర్సిటీ గిరిజన ప్రాంతానికి దూరం, మైదాన ప్రాంతానికి దగ్గర. దీనివల్ల గిరిజన విద్యార్ధులు కేవలం రిజర్వేషన్‌ సంఖ్యకే పరిమితమయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే నేడు ఎన్‌ఐటి లలో స్థానికులకు 50 శాతం కేటాయింపు నిబంధన ఉన్నట్లు గిరిజన యూనివర్సిటీ లో కూడా అడ్మిషన్లలో 50 శాతం గిరిజన విద్యార్ధులకు చెందేలా నిబంధన విధించాలి. చట్టంలో ఉన్నట్లుగా దీని ఏర్పాటు కాని 2014 లోనే ప్రారంభమైనట్లయితే నిపుణుల నివేదిక ప్రకారం నేటికి 5100 మంది ఉన్నత విద్య పూర్తి చేసుకునేవారు. ఇంత నష్టం ఇప్పటికే జరిగింది కాబట్టి ఏమాత్రం జాప్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలలో దీని మొత్తం నిర్మాణం పూర్తయ్యేలా అవసరమైన నిధులు కేటాయించి, పూర్తి స్థాయి వైస్‌ చాన్సలర్‌, శాశ్వత సిబ్బందిని తక్షణం నియమించాలి. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా పలు రాజకీయ పార్టీలు, సంస్థలు విబేధాలను పక్కన పెట్టి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుండాలి.