అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు కాలి నడకనే సుదూర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు చేరుకున్నారు. విశాఖ, విజయనగరం ఏజన్సీ ప్రాంతాల నుండి వలసలు వెళ్లి...సొంత గూళ్లకు చేరిన గిరిజనుల దీనగాధలను తెలుసుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నంలో...అనేక ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు లోకి వచ్చాయి. విశాఖ జిల్లా అనంతగిరి మండలం రోంపల్లి, ఎన్.ఆర్.పురం, గరుగుబల్లి గ్రామాల నుండి సుమారు రెండు వేల మంది గిరిజనులు గుంటూరు ఇటుకల బట్టీలలో పనికి వెళ్తున్నారు. అలా వెళ్లిన 30 సంవత్సరాల సోముల లక్ష్మి అనారోగ్యంతో గత సంవత్సరం మతి చెందింది. డుంబ్రిగూడ మండలం గసభ, కిల్లోగూడ పంచాయతీల లోని గ్రామాల నుండి ఐదు వందలకు పైగా కుటుంబాలు కాకినాడ పోర్టు, విజయవాడలో భవన నిర్మాణ పనికి, భీమవరంలో రొయ్యల చెరువులలో పనికి వెళుతుంటారు. కిల్లోగూడ గ్రామానికి చెందిన 20 మందిని రాజమండ్రి పనికి అని చెప్పి రాత్రి పూట షోలాపూరు చేపల వేటకు తీసుకుపోయారు. అక్కడ పని చేయలేక, అనారోగ్యంతో కిల్లో ప్రహ్లాద్, శెట్టి నాగరాజు అనే 22 సంవత్సరాల యువకులు చేపల చెరువుల దగ్గరే చనిపోయారు. మృత దేహాలను ఇంటికి తీసుకువెళతామని తోటి కార్మికులు కోరినప్పటికీ...యాజమానులు, బ్రోకర్లు కలిసి అక్కడే ఇసుకలో పాతి పెట్టేశారు. మనసు మెలిపెట్టే ఇటువంటి ఘటనలు, గాయాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో.
అసౌకర్యాల మధ్యే పని
పని ప్రదేశంలో ఎక్కడా ఎటువంటి సౌకర్యాలు ఉండవు. ఇటుక బట్టీల కూలీలకు చిన్న చిన్న గుడిసెలు వేస్తారు. రొయ్యల చెరువులలో పని చేసే 50 నుండి 60 మంది మహిళలకు కలిపి ఒక గది ఇస్తారు. నెలకు రూ.7 వేల జీతం. రోజుకు 14 గంటల పని ఉంటుంది. సరైన పోషకాహారం ఉండదు. ఇంటికి వచ్చిన వీరికి రక్త పరీక్ష చేయిస్తే హిమోగ్లోబిన్ 6-7 మధ్యలోనే ఉంది. మరుగుదొడ్లు సరిగ్గా ఉండవు. అనారోగ్యం వచ్చినా పట్టించుకోరు. కడుపు నిండా భోజనం కూడా పెట్టరు. డుంబ్రిగుడ మండలం మెర్రిగూడ గ్రామానికి చెందిన గిరిజనులు కాకినాడ పోర్టుకు పనికి వెళ్లారు. బియ్యం బస్తాలు లోడు చేయడానికి 24 గంటలూ ఓడలోనే ఉండాలి. నిద్ర ఉండదు. నాలుగు గంటల పనికి 500 రూపాయలు ఇస్తారు. సరైన భోజనం పెట్టరు. ఇంటికి వెళ్తామని వంతల శుక్ర, పాంగి రాజారావు అడిగితే సగం డబ్బులే ఇస్తామన్నారని తెలిపారు. అంతేకాక అసభ్య పదజాలంతో తిడతారన్నారు.
ఉపాధి లేక వలసలు
స్థానికంగా ఉపాధి దొరక్కే దూర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందని అందరూ తెలిపారు. గ్రామంలో ఉపాధి హామీ పని 100 రోజులు సరిపోవడం లేదన్నారు. భూమి లేని వారు ఎక్కువ మంది వలసలు వెళ్తున్నారు. అనంతగిరి మడలం రోంపల్లి పంచాయతిలో 150 కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు. వీరంతా సంవత్సరంలో కనీసం ఆరు నెలలకు పైగా వలసపోతారు. గ్రామాలలో 18-30 సంవత్సరాల యువత ఎక్కువ మంది దూర ప్రాంతాలకు కూడా వెళ్లడానికి వెనకాడడంలేదు.
కరోనా వల్ల అధిక నష్టం
లాక్‌డౌన్ విధించడంతో ఇటుక బట్టీల యాజమాన్యాలు సగం కూలి డబ్బులు వారి దగ్గరే ఉంచేసుకున్నాయి. ఒక్కొక్కరివి రూ. 20 నుండి రూ. 30 వేల వరకు ఉండిపోయాయని కిల్లో మోహన రావు వాపోయాడు. స్వంత గ్రామంలో ఉపాధి పనులు అయిపోయాయని, కరోనా లేకపోతే వలసలు వెళ్లిపోయేవారమని అన్నాడు. ప్రస్తుతం అప్పులు చేసుకుని తింటున్నామని చెప్పాడు. తమ దగ్గర వున్న అర తులం బంగారం అమ్ముకోవలసి వచ్చిందని వంతల మగ్గన్న తెలిపాడు. మొత్తంగా చూస్తే కరోనాకు ముందు, తరువాత కూడా గిరిజన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున వలసలు పెరుగుతున్నాయి. వీరికి కనీస వేతనాలు కానీ, కార్మిక చట్టాలు కానీ అమలు ప్రసక్తే లేదు. వసతి, ఆహారం వంటి కనీస సదుపాయాలు కూడా కరువే. వీటికి మించి తక్కువ కూలీ డబ్బు కూడా పూర్తిగా ఇవ్వకపోవడం, స్వగ్రామాలకు పంపకపోవడం, అనారోగ్యం పాలయినా వైద్యం కల్పించకపోవడం, ఆఖరుకు చనిపోయినా అమానవీయంగా ప్రవర్తించడం వంటివన్నీ పని ప్రదేశాలలో పరిపాటి. కొట్టడం, తిట్టడం కూడా మామూలే. ఇన్నింటిని ఓర్చి గిరిజనులు వలసలకు సిద్ధమయ్యారంటే, స్వగ్రామాలలో ఎంత దుర్భర పరిస్థితులున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
స్థానిక ఉపాధి కల్పన
గిరిజనులను ఇన్ని కష్టాల నుండి రక్షించాలంటే స్థానికంగా ఉపాధి కల్పించే ఏర్పాటు ప్రభుత్వం చేయాలి. ఐటిడిఎ, గిరిజన కార్పొరేషన్ ద్వారా చిన్న పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలి. గిరిజన ప్రాంతంలో విస్తారంగా లభించే చింతపండు, పసుపు, అల్లం, కాఫీ, షికాయి, పళ్ళు, ఫలాలు వంటి వనరులను సక్రమంగా వినియోగించే ప్రోసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ఉపాధి లభ్యమవుతుంది. ప్రస్తుతం అరకు, పార్వతీపురంలో జిసిసి ఆధ్వర్యంలో నడుస్తున్న సబ్బుల పరిశ్రమల ద్వారా కొంతమంది గిరిజన యువతకు ఉపాధి కలుగుతోంది. ఇటువంటి చిన్న తరహా పరిశ్రమలు స్థానికంగా లభ్యమయ్యే అటవీ సంపదను వినియోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే గిరిజన యువత అత్యంత దుర్భర వలసల నుండి విముక్తి చెందుతారు. భూమి లేని గిరిజనులకు భూమిని కేటాయించాలి. వీరి వ్యవసాయానికి అవసరమైన సహకారం ప్రభుత్వం అందించాలి. ఉపాధి హామీ పనులు కనీసం 200 రోజులకు పెంచి వేతనాన్ని రోజుకు రూ.ఆరు వందలు ఇవ్వాలి. ఇటువంటివేమీ చేయకుండా 'గిరిజనోద్ధరణ' అంటూ ప్రభుత్వాలు ఎన్ని నినాదాలిచ్చినా అవన్నీ గిరిజనులను మోసపుచ్చడానికే. ఆచరణలో వారి జీవితాలను ఏమాత్రం మార్చలేవు. పైగా మరింత దుర్భర స్థితిలోకి నెట్టబడతాయి. పాలకులు ఇప్పటికైనా సరైన చర్యలు చేపట్టాలి.
(వ్యాసకర్త సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి)










