ప్రజాశక్తి - బుట్టాయగూడెం
గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, గిరిజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొయ్యలగూడెం మండలంలో బుధవారం ప్రారంభమైన బైక్ యాత్ర రెండోరోజు గురువారం మండలంలోని బూసరాజుపల్లి ఎపి గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, గిరిజన హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవన్నారు. పులిరాముడుగూడెం హాస్టల్లో ఒక విద్యార్థి హత్య జరిగిన తరువాత గానీ ఆ హాస్టల్‌కు కనీస మౌలిక వసతులు కల్పించారన్నారు. అదేవిధంగా అన్ని గిరిజన సంక్షేమ హాస్టళ్లలో ఈ విధమైన వసతులు, సీసీ కెమెరాలను అధికారులు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐటిడిఎ పరిధిలో ఉన్న గిరిజన హాస్టళ్లలో విద్యార్థులకు సరిపడు గదులు లేవని, డైనింగ్ హాళ్లు కూడా లేకపోవడం, ఉన్న డైనింగ్ హాళ్లు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. గిరిజన హాస్టళ్లలో నిత్యావసర సరుకులు కాంట్రాక్ట్ పద్ధతిలో అందిస్తున్నారని, కాంట్రాక్టుదారులు టెండర్ వేయడానికి వచ్చినప్పుడు ఒక క్వాలిటీ ఒకరేటు విద్యార్థులకు సరఫరా చేసే సమయంలో నాసిరకం కనిపిస్తుందన్నారు. ఈ విధంగా విద్యార్థులకు నాశిరకమైన సరుకులు సరఫరా చేస్తున్నారన్నారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిఒ3ను చేసిందని, దీనివల్ల స్థానిక గిరిజన యువకులకు ఉద్యోగాలు లేకుండా పోయాయని విమర్శించారు. గిరిజనేతులకు ఉద్యోగాలు ఎక్కువ కల్పిస్తున్నారని, జిఒ3ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలో స్పెషల్ డిఎస్‌సి తీసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ గిరిజన విద్యాలయంవైపు రాష్ట్ర ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడటం లేదని, గిరిజన సంక్షేమ ఖాతాలోని నిధులను నాడు-నేడు పథకానికి మళ్లించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు జి.మణి, రాజేష్, దుర్గారావు పాల్గొన్నారు.










