Feb 24,2023 23:44

హాజరైన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:
నూతన ఎడ్యుకేషన్‌ పాలసీతో గిరిజన ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు సిహెచ్‌ పావని తెలిపారు. అల్లూరి జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన అరకు వేలి గిరిజన సంఘం కార్యాలయంలో మూడు రోజుల పాటు జరగనున్న విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులకు శుక్రవారం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు 87 పాఠశాలలు మూసివేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన చాలా దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను వ్యాపారంగా మార్చిందన్నారు. గిరిజన పేద విద్యార్థులకు ఉన్నతమైన చదువు అందనీయకుండా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేస్తున్నామని ధ్వజమెత్తారు. సమాజాభివృద్ధికి శాస్త్రీయ విద్యా విధానం, సైన్స్‌ను అభివృద్ధి చేయకుండా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు అడ్డుకుంటున్నాయని చెప్పారు.ఉచిత నిర్బంధ విద్య అందించవలసిన ప్రభుత్వాలు వివిధ రకాల పేర్లతో ప్రభుత్వ పాఠశాలను మూసి వేస్తున్నాయని విమర్శించారు. అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలలో కనీస సిబ్బంది లేకుండా కేవలం ఒక ప్రిన్సిపాల్‌తో కళాశాల ప్రారంభించారని, నేటికీ పూర్తి స్థాయిలో అధ్యాపకులు నియమించకపోవడం సిగ్గు చేటన్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, తక్షణమే హెల్త్‌ అసిస్టెంట్‌లను రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన విద్యార్థులకు గతంలో కాస్మోటిక్‌ చార్జీలు ఇచ్చేవారని, జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి పేరుతో ఒక కుటుంబానికి ఒక విద్యార్థికి మాత్రమే చెల్లిస్తూ మిగితా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.ఉన్నత విద్య వ్యవస్థలో భవన, యూనివర్సిటీ ఫీజులతో పేద విద్యార్థులను దోపిడి చేస్తున్నారన్నారు.నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడి మన హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు జీవన్‌, జిల్లా సహాయ కార్యదర్శి జి.చిన్నారావు, జి.కార్తీక్‌, అరకువేలి మండల ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్‌ కన్వీనర్‌ ఎస్‌.గంగమ్మ, మండల నాయకురాలు పుష్ప, ఎస్‌ఎఫ్‌ఐ అరకువేలి మండల అధ్యక్షులు కె.సిమోన్‌, కార్యదర్శి పి.సరేంద్ర, గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న విద్యార్థులు పాల్గొన్నారు.