Feb 20,2023 23:54

ఐటిడిఎ పిఒను ప్రశ్నిస్తున్న గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామారావు తదితరులు

ప్రజాశక్తి - రంపచోడవరం
దేవీపట్నం మండలం ముసినిగుంట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ బాలికల పాఠశాలలో వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినుల మరణంపై తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నేతలు తీవ్రంగా నిరసించారు. గిరిజన సంఘం, ఎవిఎస్‌పి సంఘాల ఆధ్వర్యాన విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం ఐటిడిఎ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. 'గిరిజనులు, గిరిజన విద్యార్థులు చనిపోతే పట్టించుకోరా?' 'విద్యార్థుల ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా? సిగ్గు.. సిగ్గు..' 'విద్యార్థుల మరణాలను అరికట్టాలి', 'చనిపోయిన విద్యార్థినుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి', 'ముసినిగుంట పాఠశాల హెచ్‌ఎం, వార్డెన్లను సస్పెండ్‌ చేయాలి', ఐటిడిఎ పిఒ, డిడిలను బర్తరఫ్‌ చేయాలి' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మరణాలపై ఐటిడిఎ పిఒ వచ్చి సమాధానం చెప్పాలని తల్లి తండ్రులు పట్టుబట్టడంతో పిఒ గ్రీవెన్స్‌ నుండి ధర్నా వద్దకొచ్చి సమస్యలను విన్నారు. పిఒకు సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థులు చనిపోతే ఐటిడిఎ అధికారులు ఏమి చేస్తున్నారని, 2 పాయింట్లు బ్లడ్‌తో చనిపోవాల్సిన పరిస్థితి ఆడపిల్లలకు ఎందుకు వచ్చిందని గిరిజన సంఘం నేతలు ప్రశ్నించారు. పిఒ స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ పిల్లలను హాస్టల్‌కు పంపేది లేదని తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ మృతుల్లో రెండో అమ్మాయి ఎయిడ్స్‌ వచ్చి చనిపోయిందని అధికారులు అంటే, ఎయిడ్స్‌ వచ్చి చనిపోతే అధికారులు ఏమి చేస్తారని పిఒ మాట్లాడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పాఠశాల, ఐటిడిఎ అధికారుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు. వాస్తవాలను పక్కన పెట్టి, గిరిజన విద్యార్థుల మరణాలు గురించి పట్టకుండా, వారి ప్రాణాలకు విలువ లేకుండా లెక్క లేనితనాన్ని ప్రదర్శిస్తున్నారని నిలదీశారు. దీనికి స్పందించిన పిఒ విద్యార్థినుల మరణాలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దీనికి ముందు ధర్నాలో లోతా రామారావు మాట్లాడుతూ వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడంతో ఆ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన, భయబ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తక్షణమే హెల్త్‌ ఎమెర్జెన్సీ ప్రకటించి, నిధులు కేటాయించాలని, అన్ని ఆశ్రమ పాఠశాలలకు ఎఎన్‌ఎంలను నియమించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముసినిగుంట పాఠశాల హెచ్‌ఎం, వార్డెన్లు, పైస్థాయి ఐటిడిఎ అధికారులను సస్పెండ్‌ చేయాలని, ఆశ్రమ హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేయాలని, ప్రతినెలా వైద్య పరీక్షలు నిర్వహించాలని, రక్త హీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షలు ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, జిల్లా నాయకులు సాదల విద్యాసాగర్‌ రెడ్డి, కంభం శాంతి రాజు, బట్ట మల్లిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్ల వాణిశ్రీ, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి చావలం రాంబాబు, గొల్లె రవికుమార్‌ రెడ్డి, పూసం బాలు దొర, బోరుగ గంగరాజు, కుర్సం వరలక్ష్మి, బోరగా ఎర్రమ్మ, పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.