Feb 11,2023 23:50

మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న లోతా రామారావు, విద్యాసాగర్‌ రెడ్డి

గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు
ప్రజశక్తి-రాజవొమ్మంగి

దేవీపట్నం మండలం ముసినిగుంట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని కె.ఈశ్వరి దేవి మృతిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు డిమాండ్‌ చేశారు. శనివారం గిరిజన సంఘం నాయకులు ఈశ్వరి చదువుతున్న పాఠశాలను సందర్శించి, అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈశ్వరి దేవి మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెల్త్‌ చెకప్‌లు మూడు నెలలకు ఒక సారి చేయడం లేదని, తమ కుమార్తెకు సీరియస్‌ అయ్యేవరకు పాఠశాల సిబ్బంది తమకు ఒక మాట కూడా చెప్పలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రోజుల నుండి అనార్యోగంతో ఉంటే మూడు రోజుల నుండి బాగోలేదని సిబ్బంది తెలిపినట్లు వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లోతా రామారావు మాట్లాడుతూ పాఠశాలలో రెగ్యులర్‌గా హెల్త్‌ చెకప్‌లు నిర్వహించకపోవడంతో ఈశ్వరి దేవికి కేవలం 2 పాయింట్లు మాత్రమే బ్లడ్‌ ఉందన్న విషయం తెలియలేదన్నారు. గిరిజన విద్యార్థుల మరణాలను అరికట్టడంతో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. గతంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్‌ వర్కర్లు ఉండేవారని, వారిని ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించడంతో విద్యార్థులకు రెగ్యులర్‌గా వైద్య సేవలు అందక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. గిరిజన విద్య, వైద్యానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఐటీడీఏ హాస్టల్‌లో హెల్త్‌ వాలంటీర్లను కూడా నియమించలేని దుస్థితిలో ఉన్నాయని విమర్శించారు. ముసిడిగుంట ఆశ్రమ పాఠశాలలో ఉన్న సుమారు 258 మంది విద్యార్థినుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. తక్షణమే ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గిరిజన విద్యార్థుల మరణాలు అరికట్టాలని, గిరిజన వసతి గృహాల్లో హెల్త్‌ వాలంటీర్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లపై విద్యార్థి, గిరిజన సంఘాల నాయకులు అనేకమార్లు ఆందోళన చేస్తే వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది తప్పా, సమస్యలను పరిష్కరించలేదని తెలిపారు. ఈ విద్యార్థిని మరణానికి ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మతి చెందిన బాలిక కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు సాధల విద్యాసాగర్‌ రెడ్డి పాల్గొన్నారు.