Dec 12,2022 22:37

ఐటిడిఎ వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ధర్నా
ప్రజాశక్తి - బుట్టాయగూడెం

                  గిరిజన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపిమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కెఆర్‌.పురం ఐటిడిఎ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిమూర్తి మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన విద్యారంగ సమస్యలపై 18సార్లు అధికారులకు వినతిపత్రం ఇచ్చామని, అక్టోబర్‌ 15 నుంచి 22 వరకూ అన్ని ఐటిడిఎ ఆశ్రమ పాఠశాలలకు జీపుజాతా నిర్వహించి, నవంబర్‌ 20వ తేదీన రాష్ట్రస్థాయి సదస్సు పాడేరులో జరిగిందని చెప్పారు. సదస్సు అనంతరం అధికారులకు సమస్యలపై వినతి పత్రం ఇచ్చినా ఇంతవరకూ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని, ప్రభుత్వం గిరిజన విద్యారంగ సమస్యల పట్ల తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఎపి గిరిజన సంఘ నాయకులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ గిరిజన విద్యారంగంలో జిఒ మూడును సుప్రీంకోర్టులో కొట్టివేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ జిఒకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయకపోవడం వల్ల గిరిజన ఉపాధ్యాయ నియామకాలు, ప్రమోషన్లు రకరకాల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, దీనిపై ప్రభుతవం స్పష్టమైన వైఖరి కూడా తీసుకోవడం లేదన్నారు. అప్‌ గ్రెడేషన్‌, డివైఇఒ పోస్టులు, జూనియర్‌ కాలేజీల స్థాపన, అధ్యాపకుల నియామకం వంటివి సందిగ్ధంలో పడ్డాయన్నారు.
సిఆర్‌టిల రెగ్యులరైజేషన్‌ ఊసే లేదని, భాషా వాలంటీర్లకు బడ్జెట్‌ కేటాయించినా, నియామకాలు లేవని, ఇలా ఉపాధ్యాయుల సమస్యలు తీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం గిరిజన విద్యారంగానికి సంబంధించి వస్తున్న సమస్యలు పరిష్కరించకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును ఉపాధ్యాయులు గిరిజన విద్యార్థి సంక్షేమ శ్రేయోభిలాషులు ఖండించాలన్నారు. ఈ ధర్నాలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయరామరాజు, ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్‌.సుధారాణి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వి.కనదుర్గ, జీలుగుమిల్లి ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకటేశ్వరరావు, కుక్కునూరు మండల ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ముషబ్బర్‌, కొయ్యలగూడెం మండల ప్రధాన కార్యదర్శి కె.ఈశ్వర్‌, యుటిఎఫ్‌ నేతలు షేక్‌ బాజీ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు