ప్రజాశక్తి- అరకులోయ : సుగంధ ద్రవ్యాల సాగుకు మన్యం నిలయమని జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందించి గిరిజనుల ఆర్థికాభివృధ్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. మంగళవారం అరకులోయలోని రణజిల్లెడ వైష్ణవి రిసార్ట్స్‌లో స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మిరియాల ఉత్పత్తుల కొనుగోలుదారులు, విక్రయదారుల రెండు రోజుల సదస్సులో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సుగంధ ద్రవ్యాల ప్రోత్సహిస్తే అల్లూరి జిల్లా కేరళను ముంచిపోతుందన్నారు. అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులు ప్రతికూల పరిస్థితుల్లోనూ మిరియాలు, పసుపు, తేనె, కరక్కాయ వంటి అటవీ ఉత్పత్తులు సాగు, సేకరణ చేస్తున్నారని, అయితే గిట్టుబాటు ధర దక్కక వీరి శ్రమ దళారుల పాలుకావడం దురదృష్టకరమన్నారు. అటవీ ఉత్పత్తులతోనే గిరిజనం జీవనం, మనుగడ ముడిపడి ఉందని, కాపీ, మిరియాలు, పసుపు వంటి అటవీ ఉత్పత్తులను వాణిజ్య సంస్థలు నేరుగా గిరిజనుల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు.ప్రతి ఆరు నెలలకు ఒకసారి విక్రయదారుల సదస్సులు నిర్వహించడం వల్ల దళారి వ్యవస్థ తగ్గుముఖం పడుతుందన్నారు.
అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, కాఫీ కంటే మిరియాలకు అధిక ధర లభిస్తుందన్నారు. రైతులు వారపుసంతలో కాపీ, మిరియాలు విక్రయించవద్దన్నారు. గిరిజన రైతులకు మార్కెటింగ్ సదుపాయాల కల్పనలో తగినవిధంగా సహాయ సహకారాలు అందించాలని కొనుగోలుదారులకు సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెన్సీలో మండలానికి రెండు గ్రామాలను ఎంపిక చేసి, మిరియాలు క్రయవిక్రయాలపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు
అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ, రైతులకు ఆర్థికసాయం అందించి గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. . మిరియాల సేకరణకు నిచ్చెనలు సరఫరా చేయాలని అన్నారు. ట్రైకర్ చైర్మన్ శతక బుల్లిబాబు మాట్లాడుతూ, జిల్లా పరిధిలో స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు జేయాలని సూచించారు. దళారుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం క్రయ,విక్రయదారులు, గిరిజన రైతులతో జిల్లాకలెక్టర్ ముఖాముఖి అయ్యారు.
కార్యక్రమంలో సుగంధ ద్రవ్యాల బోర్డు డిప్యూటీ డైరెక్టర్లు జోజి మాథ్యూ, నితిన్ జోరు, ఎన్‌సిడిసి రీజనల్ డైరెక్టర్ వీకే దుబాసి, సంచాలకులు వి. జిజీషన, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బొడ్డు కల్యాణి, ఫుడ్ అండ్ ఆగ్రో మేనేజర్ వినరుసింగ్, పద్మాపురం సర్పంచ్ సుస్మిత, అరకు ఎంపిపి ఉషారాణి, ఎంపిటిసి కిలో కుమారి,వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు కొనుగోలు, విక్రయదారులు, రైతులు పాల్గొన్నారు.










