
ప్రజాశక్తి - వీరఘట్టం : వేసవి ప్రారంభం కాక ముందే గిరిజన తండాలో తాగునీటి సమస్య తలెత్తిందంటే అధికారుల పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మీ గ్రామాలకు అదిచేస్తాం... ఇదిచేస్తామని పాలకులు ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారు తప్ప కనీసం మంచినీటి సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని గదబవలస పంచాయతీ పరిధిలోనే శాంతిగూడ, కొత్తగూడ గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 20 కుటుంబాల గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామంలో ఒక బోరు, ఒక నేల బావి ఉన్నాయి. అయితే బోరు ద్వారా వచ్చే నీరు తాగేందుకు పనికిరావడం లేదని, ఇతరాత్ర అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నట్లు గిరిజన మహిళలు వి.అనిత, సుస్మిత తెలిపారు. ఐటిడిఎ ఆధ్వర్యంలో కొన్నేళ్ల కిందట బోరుబావితో పాటు మోటర్ సదుపాయం కూడా కల్పించారు. వీధిలో పైప్‌లైన్ కూడా ఏర్పాటు చేశారు. అధికలోడు ప్రభావం మోటార్‌కు సంబంధించిన మిషన్ పోయిందని, మరమ్మతులు చేపట్టాలని పంచాయతీ పాలకవర్గానికి రెండు నెలల నుంచి ఫిర్యాదు చేసినా కనీసం చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు వి.శ్రీను, మిన్నారావు, ఎ.సుబ్బారావు, శోభన్ వాపోతున్నారు. మోటారు మొరాయించి రెండు నెలలు కావస్తుండడంతో కనీస చర్యలు చేపట్టక పోవడంతో అందుబాటులో ఉన్న బావిలోని కలుషిత నీటిని తోడుకొని తీసుకొచ్చి దాహార్తితో పాటు వంటలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. కలుషిత నీటిని వినియోగించడం వల్ల వ్యాధుల బారినపడి వేలాది రూపాయలు వెచ్చించి రోగాలు నయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గిరి పుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులకు గురైన మిషన్ బాగు చేసి వినియోగంలోకి తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు.