Aug 17,2023 00:21

పాడేరులో హాజరైన సుబ్బారెడ్డి, నాయకులు

ప్రజాశక్తి-పాడేరు: గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో మెడికల్‌ కాలేజీ, ఉత్తరాంధ్రలో ట్రైబల్‌ యూనివర్సిటీ వంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. స్థానిక విఆర్‌ కళ్యాణ మండపంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాడేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతికి తావు లేకుండా వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు రానున్న ఎన్నికలకు సమాయత్తం కావాలని గతసారి మాదిరిగానే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు వంటి దుష్టులు ప్రభుత్వ పాలన పైనా, వాలంటీర్‌ వ్యవస్థ పైనా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. 2024లో మళ్లీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించిన వాలంటీర్‌ వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ దుష్ప్రచారం చేస్తున్నారని, డేటా చౌర్యం పేరుతో తప్పుడు ఆరోపణ చేస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లిద్దరు ప్రభుత్వం చేస్తున్న మంచిని తట్టుకోలేక రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్‌ వ్యవస్థను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మత్స్యరాస వెంకటలక్ష్మి, జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ సుభద్ర, జిసిసి చైర్పర్సన్‌ స్వాతిరాణి, ట్రైకార్‌ చైర్మన్‌ శతక బుల్లిబాబు, నియోజక వర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అరకులోయ:
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేశారని వైసిపి కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం అరకులోయకు వచ్చిన ఆయన స్థానిక రిసార్ట్స్లోలో నియోజకవర్గం నేతలు, పార్టీ కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనులు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి అమితమైన ప్రేమ ఉందని ఆయన అన్నారు. సచివాలయాల ఏర్పాటుతో అవినీతి లేకుండా పథకాలు పొందవచ్చునన్నారు. వైయస్‌ జగన్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి,జడ్పీ చైర్మన్‌,జల్లిపల్లి సుభద్ర, జిసిసి చైర్మన్‌ శోభ స్వాతిరాణి, స్వచ్చంద్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శోభ సోమేశ్వరి, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి దేవి, డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.