* రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి - మందస / పలాస : గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మందస మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రూ.30 లక్షల అంచనా విలువతో నిర్మించనున్న ట్రైబల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదివాసీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తెగల సంస్కతీ సంప్రదాయాలు, భాష, లిపి, ఆచార వ్యవహారాలు రక్షించుకునే ఉద్దేశంతో ఏటా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గిరిజన సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుత ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని, ఏ ప్రభుత్వం వల్ల గిరిజనుల జీవితాల్లో మార్పులు వచ్చాయో పరిశీలన చేయాలని కోరారు. రెండున్నర లక్షల ఎకరాలు ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఇంకా ఎవరికైనా అర్హత ఉండి ఇవ్వాల్సి ఉన్నట్లయితే వారికీ పట్టాలు అందజేస్తామని తెలిపారు. జిల్లాల విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు పాలనలో గిరిజనులు పూర్తిగా వెనుకబడిపోయారని విమర్శించారు. ప్రతి గిరిజన కుటుంబాన్ని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్ పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఎంపిపి డొక్కరి దానయ్య, జెడ్‌పిటిసి సవర చంద్రమ్మ, వైస్ ఎంపిపి సీర ప్రసాద్, తహశీల్దార్ బి.పాపారావు, సచివాలయాల కన్వీనర్ చింతాడ గణపతి, మందస మేజర్ పంచాయతీ సర్పంచ్ సిహెచ్.ఎల్లమ్మ, ఎంపిటిసి కంచి బెహరా, ఆదివాసీ వికాస పరిషత్, గిరిజన సంఘాల నాయకులు సవర.చంద్రరావు, ఎస్.డుంబురు, ఎస్.సీతారాం తదితరులు పాల్గొన్నారు.










