- పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ
ప్రజాశక్తి మారేడుమిల్లి
గిరిజన సంక్షేమ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. మారేడుమిల్లి మండలంలో గురువారం ఆయన పర్యటించారు. అనంతరం స్థానిక విద్య వనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ పాఠశాలలో వసతి సౌకర్యాలు లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో అరకొరగానే ఉపాధ్యాయులను నియమించి విద్యను కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రతి పాఠశాలలో వాచ్మెన్, కమాటి పోస్టులను నియమించాలని కోరారు. గతంలో విద్యార్థులు అనారోగ్య బారిన పడితే ఫండ్స్ కేటాయించే వారని ఇప్పుడు ఉపాధ్యాయుల జేబులోని సొమ్ముతో వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక్కడ పనిచేస్తున్న టీచర్లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలని జీతాలతో సిఆర్‌టిలను నియమించి పబ్బం గడుపుకుంటుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్స్ సింగ్ టీచర్స్ ఎమ్మెల్సీకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వై.విల్సన్ బాబు, జిల్లా కార్యదర్శి ఐటీడీఏ సబ్ కమిటీ కన్వీనర్ కే.ఆదిరెడ్డి, సబ్ కమిటీ కో కన్వీనర్ డి మహేష్, రంపచోడవరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సనాతన బాబు, వెంగళరావు, ఎం సాయిబాబా దొర, లవ కుమార్ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.










