ప్రజాశక్తి- చింతూరు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యాన చేపట్టిన జీపు జాతా సందర్భంగా మండలంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. అనంతరం చింతూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లేమి కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయని పేర్కొన్నారు. చింతూరు, కూనవరం, విఆర్.పురం, ఎటపాక తదితర నాలుగు విలీన మండలాల్లో పాఠశాలలను సందర్శించినట్లు చెప్పారు. గిరిజన విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నామని చెబుతుండగా, ఇక్కడ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. తగినంత మంది ఉపాధ్యాయులను నియమించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల గిరిజనులు విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. గిరిజన మండలాల్లో ఏమ్‌ఈఓ పోస్టులను, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయాలని. సిఆర్పిలకు డీఎస్సీ నుండి మినహాయింపునిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని. 12నెలల జీతం చెల్లించాలని, రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగా 22 రోజులు సెలవు మంజూరు చేయాలని కోరారు. గిరిజన మాతృభాష వాలంటీర్లను రెన్యువల్ చేయాలని, విద్యార్థులకు మెనూ ఛార్జీలు పెంచి, కాస్మటిక్ బడ్జెట్ విడుదల చేయాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాలు మరుగుదొడ్లు. డైనింగ్ హాల్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ, నాయకులు ఎస్.నాగేశ్వరరావు, నెల్సన్ బాబు, సనాతన బాబు, వెంకటనారాయణ, పండా కృష్ణయ్య, పూనెం నాగేశ్వరరావు, శ్రీనివాస్ దొర, బి.ముత్తయ్య, పి.విజరు పాల్గొన్నారు.










