Jul 11,2023 23:08

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
          మండలంలోని పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహం విద్యార్థి మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఉర్రింక గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, రామలక్ష్మి దంపతుల కుమారుడు గోగుల అఖిల్‌వర్థన్‌రెడ్డి(11) సంక్షేమ హాస్టల్లో ఉంటూ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఎప్పటి లాగే సోమవారం రాత్రి హాస్టల్లో భోజనం చేసి నిద్రపోయాడు. ఉద యం తోటి స్నేహితులు లేచిచూసేసమయానికి అఖిల్‌వర్థన్‌రెడ్డి కని పించలేదు. చుట్టుపక్కల వెతకడంతో హాస్టల్‌ సమీపంలో మృతిచెంది కనిపించాడు. వెంటనే విద్యార్థులు నైట్‌వాచ్‌మెన్‌ రాజేష్‌కు సమా చారం అందించారు. ఆయన హాస్టల్‌ వార్డెన్‌కు, పోలీసులకు సమా చారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
'విద్యార్థులందరూ వెళ్లిపోండి'
ఇదిలా ఉండగా విద్యార్థి చేతిలో లభించిన ఉత్తరం విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఆ ఉత్తరంలో 'ఈ పాఠశాలలో చదువుతున్న మిగిలిన విద్యార్థులు అందరూ వెళ్లిపోవాలి.. లేకుంటే ఈ విద్యార్థికి పట్టిన గతే మీకూ పడుతుంది' అని ఉంది. ఇది చూసిన తోటి విద్యార్థులు కంగారుపడుతున్నారు.
హత్యచేసి ఉండొచ్చు : ఐటిడిఎ పిఒ
హాస్టల్‌ వార్డెన్‌ చెప్పిన వివరాలను పరిశీలిస్తే అఖిల్‌ వర్ధన్‌ రెడ్డి(11)ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలుస్తోందని ఐటిడిఎ పిఒ సత్యనారాయణ తెలిపారు. కొందరు వ్యక్తులు హాస్టల్‌ నుండి బయటకు తీసుకొచ్చి స్కూల్‌ ఆవరణలో హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు హాస్టల్‌కు వచ్చి విద్యార్థులపై టార్చ్‌లైట్‌ వేసి వెతికినట్లు వార్డెన్‌ అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు. వారు ఎవరు? ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? లేక హత్యా?కాదా? అస్సలు ఏమై ఉంటుందో? వంటి కారణాలపై సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పారు. సమాచారం తెలుసుకున్న పోలీసు, రెవెన్యూ, ఐటిడిఎ, ఎంపిడిఒ తదితర అధికారులతో పాటు రాష్ట్ర గిరిజన కమిషన్‌ సభ్యులు వి.సోమశంకర్‌ నాయక్‌, ఎస్‌పి మేరీ ప్రశాంతి సఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ముగ్గురు సస్పెన్షన్‌
విద్యార్థి మృతి కేసులో భాగంగా రాష్ట్ర గిరిజన కమిషన్‌ ఆదేశాల మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.చిన్న గంగరాజును, డిప్యూటీ వార్డెన్‌ కె.శ్రీనివాస్‌ను, వాచ్‌మెన్‌ ఎం.రాజేష్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఐటిడిఎ పిఒ సత్యనారాయణ తెలిపారు. బాధిత కుటుంబానికి ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నిబంధనల ప్రకారం రావాల్సిన అన్ని ప్రయోజనాలు అందేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజా సంఘాల ఆందోళన
కారకులను గుర్తించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రగతిశీల విద్యార్థి సంఘం, ఎపి గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, రైతు కూలీ సంఘం, ఇతర పలు సంఘాలు పాఠశాల ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. హాస్టల్‌, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
విద్యార్థి మరణంపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ సభ్యులు వడిత్యా సోమ శంకర్‌ నాయక్‌ అన్నారు. హాస్టల్‌ను మంగళవారం సందర్శించి బాలుడి మృతికి సంబంధించిన వివరాలను హాస్టల్‌ సిబ్బందిని, ఐటిడిఎ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సోమశంకర్‌ మాట్లాడుతూ కేసు దర్యాప్తుకు రెండు బృందాలను నియమించారని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి నిందితులను శిక్షిస్తామన్నారు.
పోలవరం : విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొరగం శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మంగళవారం పోలవరంలో ఆయన నివాసం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులిరామన్నగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వంలో గిరిజన విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి లేకపోయినా అరాచకాలకు లోటు లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.