ప్రజాశక్తి-అరకులోయ/అరకురూరల్:అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 8వ రాష్ట్ర మహాసభ గురువారం ఘనంగా ప్రారంభమైంది.మహా సభ ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోత రామారావు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం గిరిజన సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య నగర్ వేదిక వద్ద మాజీ ఎమ్మెల్యే, గిరిజన సంఘ మాజీ అధ్యక్షులు సున్నం రాజయ్య, గిరిజన సంఘం వ్యవస్థాపకుడు మాజీ ఎమ్మెల్యే కుంజ బుజ్జి, గిరిజన రైతు ఉద్యమ నేత కామ్రేడ్ శ్రీరామ్మూర్తి చిత్రపటానికి ఆదివాసి అధికార రాష్ట్రీయ అఖిలభారత చైర్మన్ డాక్టర్ మిడియం బాబురావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ రాష్ట్ర మహాసభకు ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు అధ్యక్షత వహించారు. అనంతరం ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ అఖిలభారత చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు ప్రారంభ ఉపన్యాసం చేశారు. బాషా వాలంటరీల నియామకాలు జరగలేదన్నారు. రాష్ట్రంలో బాషా వాలంటీర్లు 1200 మంది అవసరం ఉండగా, 400 మందిని నియమించారని ఆయన అన్నారు. ఒకే భాష ఒకే మతం ఉండాలన్నది బిజెపి లక్ష్యం అన్నారు. గిరిజన భాషలో విద్యా బోధన చేయడంతో డ్రాప్ అవుట్స్ నివారణ సాధ్య మవుతుందన్నారు. ఆదివాసీలు ప్రాచీన సంస్కతికి వారసులని, వారిని చెదరగొట్టకూడదని ఆయన అన్నారు. గిరిజన భాషా సంస్కతిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికులకు సంబంధించిన విలువైన చట్టాలను బిజెపి ప్రభుత్వం నాలుగు కోడ్లుగా మార్చి పనిగంటలు పెంచిందని విమర్శించారు.1 /70 చట్టం, పిసా వంటి చట్టాలను పటిష్ట పరచకుండా తీసివేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే 2014లో ప్రణాళిక సంఘం రద్దు చేసిందన్నారు.జీవో 3 రద్దు చేయడంతో గిరిజనులు పూర్తిగా ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిసన్ వేసినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఆ ఊసే లేదని ఆయన అన్నారు.వీటన్నిటిని సాధించుకోవడానికి ఐక్య పోరాటం విస్తతంగా చేయవలసిన అవసరం ఉందన్నారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సంస్కతిక సంబరాలు గిరిజన గిరిజనుల ఐక్యతను చాటిచెబుతుందని ఆయన అన్నారు.
గిరిజనుల ఉనికిపై దాడి
మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ
ఏజెన్సీ ప్రాంతంలోని వనరులను స్వాధీనం చేసుకోవడానికి గిరిజనుల ఉనికిపై దాడి ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ తెలిపారు. రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, చీమలపై మందు వేసి చెదరగొట్టినట్లు గిరిజన ప్రాంతంలో గిరిజనం మధ్య చిచ్చుపెట్టి ఇక్కడున్న ఖనిజ సంపదలను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. అప్పట్లో గిరిజనులందరూ ఒక తాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాటం చేయడంతో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం వెనక్కు తగ్గిందని ఆయన అన్నారు.ఇప్పుడు గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి చల్లచెదురుచేసి ఉన్న ఖనిజ సంపదను దోచుకోవాలని చూస్తుందన్నారు.జీవో -3 ని రద్దు చేయడంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని, 1/ 70 చట్టంపై కూడా దాడి ప్రారంభమైందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆదాని వంటి వారి కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని దుయ్య బట్టారు.2014లో వచ్చిన మోడీ, అమిత్ షా బ్యాచిలను తీసుకుని వచ్చి గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి చర్చిలకు వెళ్లే గిరిజనులు శత్రువులుగా చూపిస్తుందన్నారు. ఇప్పుడున్నవి భద్రత లేని ఉద్యోగాలని, అప్పట్లోప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేవని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ లో 14,000 మందిలో 1000 మంది గిరిజనులు ఉన్నారని ఆయన అన్నారు. రైల్వే శాఖలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని నింపే పరిస్థితి లేదన్నారు. ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో 25 వేల మంది గిరిజనులకు ఉద్యోగాలు వస్తాయని, అదే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఒక ఉద్యోగం కూడా వచ్చే పరిస్థితి ఉండదన్నారు.అరకు లోయలో ఉన్న 140 లాడ్జిల్లో కూడా గిరిజనేతరులు బినామీ పేర్లతో నిర్మించుకుని ఉన్నారని, వాటిలో గిరిజనులు కూలీలుగా పని చేస్తున్నారని ఆయన తెలిపారు.ఏజెన్సీ 11 మండలాల్లో 9 మండలాల్లో కాపీ ఉందని, దాని ధర నిర్ణయించే పరిస్థితి రైతులకు లేకపోవడం అన్యాయమన్నారు. అనంతగిరి ఆర్గానిక్ కాపీకి డిమాండ్ ఉన్నా..కాపీ రైతులకు మాత్రం ఫలితం దక్కడ లేదన్నారు. అల్లూరి, కొమరం భీమ్, గంటం దొరల పోరాట స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.
బలమైన ఉద్యమానికి రూపకల్పన : సురేంద్ర
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు బలమైన ఉద్యమం చేయడానికి రూపకల్పన చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్ల సురేంద్ర అన్నారు. అరకులోయలో జరుగుతున్న గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడుతూ, మన్య ప్రాంతంలో 1 లక్ష 50 వేల కుటుంబాలు కాఫీపై ఆధారపడి జీవిస్తున్నాయని, వీరికి అండగా నిలబడాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలబడాలన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ను ఆదానికి ఇస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి బలమైన పోరాట నిర్మాణం అవసరం అన్నారు.గిరిజన ఉద్యమం బలపడడానికి ఆట, పాట మాట వంటి సంస్కతిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడుతుందని, భవిష్యత్తులో వీటిని మరింతగా నిర్వహించాలని ఆయన అన్నారు.గిరిజన సంఘం చేసిన పోరాటాలపై కార్యకలాపాల నివేదికను మహాసభలో సురేంద్ర నివేదించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు అధ్యక్షత వహించిన ఈ మహాసభలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, రాష్ట్ర నాయకులు, పి.అప్పలనరస, మంతెన సీతారాం, ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్, అధ్యక్షులు ధర్మన్న పడాల్, రాష్ట్ర అధ్యక్ష వర్గం నుంచి తెల్లం రామకృష్ణ, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.










