ప్రజాశక్తి -అరకులోయ రూరల్: జూన్ 5,6, 7.తేదీలో జరిగే గిరిజన సంఘం 8వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు అధ్యక్షతన అరకు వేలి గిరిజన సంఘం కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, గిరిజన సంఘం 8వ రాష్ట్ర మహాసభలో గిరిజన హక్కులు, చట్టాలు, రక్షణ కోసం గిరిజన ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం చర్చించడం జరుగుతుంద న్నారు. గ్రామసభ, పీసా కమిటీ అనుమతి లేకుండా గిరిజన ప్రాంతం అక్రమ మైనింగ్, హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.1/70, పీసా చట్టాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కి చట్టాలు మార్చుతున్నాయన్నారు. నూతన ఆటవి పాలసీ విధానం తీసుకొచ్చి గిరిజనులను అటవీ నుంచి గెంటి వేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యహరిస్తుందని విమర్శించారు.జీఓ 3కు చట్టబద్ధత కల్పించాలని, బోయ వాల్మీకులను ఎస్టీ జాబితా చేర్చాలని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం విరమించుకోకుంటే భవిష్యత్తులో మరింత పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాతృభాష విద్య వాలంటర్లకు ఉద్యోగ భద్రత కల్పించి గిరిజన అక్షరాస్యత పెంపొందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. చింతపల్లి, అనంతగిరి మండలాల పరిధిలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం గ్రామసభ అనుమతి లేకుండా దొంగ సర్వేలు నిర్వహించి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేయడం తగ్గదన్నారు. గిరిజన గ్రామాలకు మంచినీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మేధావులు, ఉద్యోగులు మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి జెడ్పిటిసి ధీసరి గంగరాజు, ఉపాధి హామీ కూలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోతురాజు, అఖిల భారత గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తౌడన్న చిట్టిబాబు, చిన్నం నాయుడు, మాతృభాష విద్య వాలంటరీ రాష్ట్ర అధ్యక్షులు పాంగి శ్రీను, మాతృ భాష విద్యా వాలంటీర్ల జిల్లా కార్యదర్శి కొర్ర సర్బనాయుడు, జిల్లా అధ్యక్షురాలు పి.కుమారి, గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, మండల నాయకులు కె.రామరావు, సత్యనారాయణ, పి సురేష్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఎస్ గంగమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ మండల గర్ల్స్ కన్వీనర్ కే.ధనలక్ష్మి, కె.కృష్ణ పాల్గొన్నారు.










